PK మార్షల్ ఆర్ట్స్ జర్నీ.. తమన్ పవర్ ఫుల్ టచ్..

ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రారంభించారు.;

Update: 2026-01-13 05:57 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచే ఆయన సినిమాల్లో కనిపించే ఫైట్స్, స్టంట్స్ మార్షల్ ఆర్ట్స్‌ పై ఉన్న డెడికేషన్ కు నిదర్శనంగా నిలిచాయి. పవన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ లు ఫ్యాన్స్‌ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో రీసెంట్ గా ఆయన తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా ఆయన తన మార్షల్ ఆర్ట్స్ జర్నీ వీడియో రూపంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లు రిలీజ్ చేసి అందులో తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న దశ నుంచి, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సాధించిన గౌరవం వరకు తన ప్రయాణాన్ని చూపించారు.

పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో మార్షల్ ఆర్ట్స్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత జపాన్‌ కు చెందిన ప్రాచీన యుద్ధకళలపై ఆసక్తి పెంచుకుని లోతైన అధ్యయనం చేశారు. ముఖ్యంగా జపనీస్ సమురాయ్ సంప్రదాయాల్లో భాగమైన కెంజుట్సు (Kenjutsu) అనే కత్తిసాము కళలో పవన్ అధికారిక ప్రవేశం పొందారు. ఈ ప్రయాణం ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.

జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థగా గుర్తింపు పొందిన సోగో బుడో కన్‌రి కై నుంచి ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. ఇది మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత అరుదైన గుర్తింపు. అంతేకాదు, జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే అవకాశం అయిన సోకే మురమత్సు సెన్సైకి చెందిన టకెడా షింగెన్ క్లాన్‌ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

ఇక గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా పవన్ కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక బిరుదుతో సత్కారం కూడా జరిగింది. మొత్తం మార్షల్ ఆర్ట్స్ జర్నీ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అందులో వినిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీడియోకు మరింత పవర్ ఇచ్చింది. దాన్ని టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

"మా ప్రియమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడం నాకు లభించిన గొప్ప గౌరవం. పీకే మార్షల్ ఆర్ట్స్ జర్నీ ఇంకా ఎన్నో ప్రత్యేక క్షణాలను మనకు చూపించబోతోంది. దీనికి సంగీతం అందించడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మా నాయకుడికి నా గౌరవం, ప్రేమ" అంటూ తమన్ రాసుకొచ్చారు. దీంతో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. వీడియోకు పవర్ ఫుల్ టచ్ ఇచ్చిందని అంతా చెబుతున్నారు.




Tags:    

Similar News