వీరమల్లుకు పర్మిషన్ ఇస్తారా?
ఏపీ ప్రభుత్వంతో పాటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వీరమల్లు టికెట్ రేట్ల పెంపు, ఎర్లీ మార్నింగ్ షో లకు పర్మిషన్ కోసం నిర్మాత ఏఎం రత్నం సంప్రదించారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలున్నాయి. అందులో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఎప్పుడో కరోనా ముందు మొదలైన ఈ సినిమా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి వరకు మరో సినిమా వచ్చింది లేకపోవడంతో ఈ మూవీపై అందరికీ అంచనాలున్నాయి.
రెండేళ్ల తర్వాత పవన్ నుంచి సినిమా వస్తుండటంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 12న హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా రిలీజ్ కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు.
అందులో భాగంగానే టికెట్ రేట్ల పెంపు కోసం కూడా రత్నం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కలిశారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు అనుసరించాల్సిన కొత్త మార్గదర్శకాల గురించి కఠినమైన సూచనలు జారీ చేయగా, ఆ రూల్స్ ప్రకారమే నిర్మాత రత్నం వీరమల్లు స్పెషల్ ప్రీమియర్లు మరియు టికెట్ రేట్ల పెంపు పర్మిషన్స్ కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఏపీ ప్రభుత్వంతో పాటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వీరమల్లు టికెట్ రేట్ల పెంపు, ఎర్లీ మార్నింగ్ షో లకు పర్మిషన్ కోసం నిర్మాత ఏఎం రత్నం సంప్రదించారు. అందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కూడా ఆయన కలిశారు. దీనిపై కూడా త్వరలోనే జోవో రిలీజ్ కానుంది. వీరమల్లు రిలీజ్ కు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు పర్మిషన్స్ ఇస్తాయనే అందరూ భావిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.