ఉస్తాద్ వస్తున్నాడు.. అంతా సిద్ధం చేయండి!
పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తర్వాత రెగ్యులర్‌గా సినిమాలకు డేట్లు ఇస్తున్నాడు.;
పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తర్వాత రెగ్యులర్‌గా సినిమాలకు డేట్లు ఇస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ పెడ్డింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ నెలలోనే ఆ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. జులైలో అయినా వీరమల్లు సినిమా విడుదల కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి. వీరమల్లు సినిమా తర్వాత ఓజీ సినిమాతో పవన్ రాబోతున్నాడు.
గత నెలలో రెండు వారాల పాటు పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ముంబైలో జరిగిన ఓజీ సినిమా షూటింగ్‌తో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారని సమాచారం అందుతోంది. మరో షెడ్యూల్‌తో ఓజీ సినిమా మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది. అతి త్వరలోనే ఓజీ సినిమాను కూడా పూర్తి చేస్తే బ్యాలన్స్ ఉస్తాద్ భగత్‌సింగ్ మాత్రమే ఉంటుంది. ఓజీ సినిమా షూటింగ్‌కు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించాలని భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలలోనే ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ నుంచి డేట్లు రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఇతర నటీనటుల కాల్షీట్స్‌ను తీసుకునే పనిలో హరీష్ శంకర్ అసిస్టెంట్స్ పడ్డారు. సాధ్యం అయినంత వరకు ముందుగా అనుకున్న ప్రకారం నటీ నటులను తీసుకోబోతున్నారు. ఒకవేళ వారి డేట్లు సాధ్యం కాకుంటే వెంటనే అందుబాటులో ఉన్న నటీనటులను రిప్లేస్ చేస్తున్నారు. హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక అయిందనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్లకు అనుసారంగా శ్రీలీల డేట్లు సెట్ అయ్యేనా చూడాలి. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
చాలా కాలం తర్వాత వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కింది. మొదట ఒక తమిళ హిట్ సినిమాకు రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్‌ను అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రీమేక్ కాకుండా కొత్త కథ, కథనంతో సినిమాను రూపొందించాలని నిర్ణయించారు. అందుకు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలు తక్కువ. ఉప ముఖ్యమంత్రిగా దాదాపు మరో నాలుగు ఏళ్ల పాటు కొనసాగనున్న పవన్ కళ్యాణ్ ఆ గ్యాప్ లో కొత్త సినిమాలు చేస్తాడని అనుకోవడం లేదు. ఆ తర్వాత పవన్ సినిమాలు చేస్తాడా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తానికి అయితే రాబోయే ఏడాది కాలం వ్యవధిలో మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పవన్ ఫ్యాన్స్‌ను అలరించే అవకాశం ఉంది.