పవన్ లైనప్.. అసలు అది నమ్మేలా ఉందా?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా అత్యంత బిజీ షెడ్యూల్ లో ఉన్నారు.;
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా అత్యంత బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. రాజకీయ బాధ్యత నిర్వర్తిస్తూ.. అదే సమయంలో సినిమాలపై కూడా దృష్టి సారించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎన్నికల ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆయన వేగం చూపించారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్‌లు పూర్తి చేసి విడుదల దశకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఇక నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగనున్నట్లు పవన్ ప్రకటించడం మరో ఆసక్తికర అంశం. అదే సమయంలో హీరోగా కొత్త సినిమాలు కూడా అనౌన్స్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఓజీ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దర్శకుడు సురేందర్ రెడ్డితో మరో ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం రావడం అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. అయితే ఆ సినిమాల షూటింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.
ఇప్పటికే ఉన్న రాజకీయ బాధ్యతలు, షూటింగ్ కమిట్మెంట్స్ మధ్య సమయం కేటాయించడం పవన్ కు సవాలు గా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మరో సినిమాలో క్యామియో పాత్రలో నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ మూవీకి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారనే రూమర్లు తెరపైకి వచ్చాయి. ఇంతకుముందు ఇదే పాత్ర కోసం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను సంప్రదించారని, ఆయన స్థానంలో ఇప్పుడు పవన్ నటిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ వార్తలు బయటకు రావడంతో సినీ ప్రియుల్లో చర్చలు మొదలయ్యాయి. అయితే పవన్ ప్రస్తుత షెడ్యూల్ ను చూసిన అభిమానులు ఆ వార్తలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ బాధ్యతలు, ఇప్పటికే ఉన్న సినిమాల పనులు పూర్తి చేయడమే కష్టంగా ఉన్న సమయంలో, మరో భారీ ప్రాజెక్ట్ లో క్యామియో చేయడానికి పవన్ కు సమయం దొరుకుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా షూటింగ్ ప్లానింగ్, డేట్స్ అడ్జస్ట్మెంట్ వంటి అంశాలు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. అసలు అది నమ్మేలా కూడా లేదని కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా పవన్ కు సన్నిహితంగా ఉన్న వర్గాలు కూడా ఆ వార్తలను ఖండిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కేవలం రూమర్లేనని, ప్రస్తుతం ఆయన పూర్తిగా తన రాజకీయ బాధ్యతలు, ముందుగా ఒప్పుకున్న సినిమాలపైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ లైనప్ పై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నప్పటికీ, ప్రతి వార్త నిజమా కాదా అన్న విషయంలో స్పష్టత అవసరం. ముఖ్యంగా క్యామియో రోల్ వంటి విషయాల్లో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే చూడాలని సినీ ప్రియులు అంటున్నారు.