సహనటుడిపై 25 కోట్లకు దావా వేసిన స్టార్ హీరో
ఖిలాడీ అక్షయ్ కుమార్- ప్రియదర్శన్ బృందం `హేరా ఫేరీ- 3` చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అయింది.;
ఖిలాడీ అక్షయ్ కుమార్- ప్రియదర్శన్ బృందం `హేరా ఫేరీ- 3` చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అయింది. అయితే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కోసమే చాలా కాలంగా డ్రామా కొనసాగుతోంది. ఇంకా కాస్టింగ్ ఎంపికలు ఫైనల్ కాలేదు. ఇందులో సునీల్ శెట్టి, పరేష్ రావల్ లాంటి సీనియర్లు తమ పాత్రలను కొనసాగిస్తారని కథనాలొచ్చాయి. కీలక నటులు అక్కీ, సునీల్ శెట్టి, పరేష్ రావల్ పలుమార్లు సమావేశమై స్క్రిప్టు గురించి కూడా చర్చించారు.
కానీ అనూహ్యంగా సినిమా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కథనాలొచ్చాయి. పరేష్ రావల్ తొలి రెండు భాగాల్లో బాబు భయ్యా పాత్రలో గొప్ప ప్రదర్శనతో మెప్పించారు. ఫ్రాంఛైజీ ఘనవిజయం సాధించడంలో అతడి పాత్ర చాలా పెద్దది. అందువల్ల మూడో భాగంలోను పరేష్ కొనసాగాల్సిందేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా పరేష్ రావల్ తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాని ప్రకటించారు. అయితే దీనికి కారణాలేమిటి?
ఇటీవలే పరేష్ రావల్ తాను హెరా ఫేరీ 3 లో భాగం కావడం లేదని ప్రకటించి నిర్మాతల్లో ఒకరైన అక్షయ్, సహనటుడు సునీల్ శెట్టి సహా అందరినీ షాక్‌కు గురిచేశాడు. మొదట్లో సృజనాత్మక విభేదాల కారణంగానే అతడు తప్పుకున్నాడని ప్రచారం కాగా, ఆ ప్రచారాన్ని పరేష్ స్వయంగా ఖండించారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ తమ మధ్య లేవని కూడా అన్నారు. అయితే పరేష్ రావల్ ఉన్నట్టుండి ఇలా చేయడం సరికాదని సోషల్ మీడియాల్లోను విమర్శలొచ్చాయి.
తాజాగా అందిన వార్త ప్రకారం.. అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పరేష్ రావల్‌కు లీగల్ నోటీసు పంపింది. పరేష్ అసంబద్ధంగా ప్రాజెక్టు నుంచి వైదొలగిన కారణంగా జవాబు దారీగా ఈ పరిహారం చెల్లించాలని నోట్ లో పేర్కొన్నారు. ఈ కామెడీ డ్రామాకు సంబంధించిన అన్ని కీలక సమావేశాల్లో పరేష్ ఉన్నాడు. కానీ ఇప్పుడు అతడు అకస్మాత్తుగా వైదొలగడానికి కారణాలను అతడు ముందే చిత్రనిర్మాతలకు చెప్పకుండా వైదొలిగాడని ఆరోపిస్తున్నారు.