హీరో కో కథ కాదు.. ఇప్పుడు హీరోకో ప్రపంచం!
ఒకప్పుడు పెద్ద హీరో సినిమా అంటే ముందు అతని ఇమేజ్‌కు సరిపోయే కథ చూసేవారు.
ఒకప్పుడు పెద్ద హీరో సినిమా అంటే ముందు అతని ఇమేజ్‌కు సరిపోయే కథ చూసేవారు. మాస్ హీరో అయితే యాక్షన్, ఫ్యామిలీ హీరో అయితే ఎమోషన్.. ఆ లెక్కలో కథను సెట్ చేసేవారు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత మరో మార్పు కనిపిస్తోంది. హీరోకు పాత్ర రాయడంతో పని అయిపోవడం లేదు. ఆ పాత్ర తిరిగే ప్రపంచం కూడా పెద్దదిగా ఉండాలి. టాక్సిక్, వారణాసి, ది ప్యారడైజ్, ఫౌజీ చూస్తే ప్రస్తుతం అదే రూట్ కనిపిస్తోంది.
యశ్ టాక్సిక్‌లో కథ గ్యాంగ్‌స్టర్ చుట్టూ ఉన్నా, దానికి ప్రత్యేకమైన కాలం, ప్రదేశం సిద్ధం చేశారు. పోర్చుగీస్ ప్రభావం ఉన్న పాత గోవా బ్యాక్‌డ్రాప్‌లో రాయా ప్రపంచాన్ని గీతూ మోహన్‌దాస్ నిర్మించింది. కేజీఎఫ్ తర్వాత యశ్ మళ్లీ మరో గ్యాంగ్‌స్టర్‌గా రావడం హైలెట్. అయితే ఆ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది, చుట్టూ ఉన్న మనుషులు, క్రైమ్ ప్రపంచం ఎలా ఉంది అన్నదానికి కూడా అంతే స్పేస్ ఇచ్చారు. సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
రాజమౌళి వారణాసి ఇంకా పెద్ద లెక్కలో ఉంది. మహేష్ పాత్రను ఒక నగరం లేదా ఒక దేశంలో పెట్టకుండా కథను ఖండాలు దాటిస్తున్నారు. వారణాసి నుంచి పురాతన రోమ్ వరకు వెళ్లే టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ ఉంటుందని రాజమౌళి ఇప్పటికే చెప్పారు. 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమాలో మహేష్ స్టార్ ఇమేజ్‌తో పాటు అతను ప్రయాణించే ప్రపంచమే మరో పెద్ద కథ.
నాని ది ప్యారడైజ్ కూడా ఇదే ఉదాహరణ. 1980ల సికింద్రాబాద్ స్లమ్‌లో ఒక అణగారిన వర్గం, వాళ్లకు ప్రత్యేకమైన ప్రాంతం, గుర్తింపు కోసం జరిగే పోరాటంతో శ్రీకాంత్ ఓదెల కథను నిర్మించాడు. సెప్టెంబర్ 24న ఎనిమిది భాషల్లో సినిమా వస్తోంది. దసరా తర్వాత నానిని మరో మాస్ పాత్రలో చూపించడం కంటే, జడల్ అనే పాత్రకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని తయారు చేయడంపైనే ఇక్కడ ఎక్కువ పని కనిపిస్తోంది.
ఫౌజీలో కూడా హను రాఘవపూడి ప్రభాస్ కోసం 1940ల కాలాన్ని ఎంచుకున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం, యుద్ధం, ఓ సైనికుడి ప్రయాణం ఈ కథకు బేస్. డిసెంబర్ 3 రిలీజ్ కోసం మూడు యూనిట్లతో షూటింగ్ పూర్తి చేసే పనిలో టీమ్ ఉంది. ఆ కాలం, యుద్ధ పరిస్థితులు, హీరో ప్రయాణాన్ని నమ్మేలా చేయడమే ఈ సినిమాకు పెద్ద పని.
ఇలాంటి సినిమాలు గతంలో లేవని కాదు. బాహుబలి లాంటి సినిమాలు చాలా ముందే ప్రత్యేకమైన ప్రపంచాలతో వచ్చాయి. కానీ ఇప్పుడు అది అప్పుడప్పుడు జరిగే ప్రయత్నంగా కాకుండా పెద్ద హీరో సినిమాల్లో ఒక ప్లాన్‌గా మారుతోంది. తెలుగు రాష్ట్రాలు ఒక్కటే కాకుండా హిందీ, తమిళం, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఒకథ పని చేయాలంటే హీరో పేరు తర్వాత అమ్మగలిగే మరో విషయం కావాలి. అందుకే ఇప్పుడు కథతో పాటు ఆ ప్రపంచాన్ని కూడా పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ముందే పరిచయం చేస్తున్నారు.