చిన్నారుల పాలిట దైవం.. గాత్రంతోనే జీవం పోస్తూ!

తాజాగా ఈ సింగర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.;

Update: 2025-11-11 11:58 GMT

కొంతమంది సినిమా సెలబ్రిటీలకు మంచి మానవతా హృదయం ఉంటుంది. సినిమాల్లో సంపాదించిన డబ్బులతో ఎంతోమంది పేదవారికి గుప్త దానాలు చేస్తూ ఉంటారు. కొంతమందేమో అందరికీ తెలిసేలా సహాయం చేస్తే మరి కొంతమందేమో తాము చేసే సహాయాన్ని బయట పెట్టుకోరు. అయితే తాజాగా అలాంటి ఒక సింగర్ గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈమె తన గాత్రంతో ఎంతోమంది ఆగిపోయే గుండెలకు ప్రాణం పోస్తోంది. సింగర్ గా రాణిస్తూ తన పాటల ద్వారా వచ్చిన డబ్బుతో ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తోంది. ఆమె ఎవరంటే ప్రముఖ సింగర్ పలక్ ముచ్చల్. తాజాగా ఈ సింగర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. దానికి కారణం ఈ సింగర్ ఇప్పటివరకు దాదాపు 3,800 పైగా హార్ట్ ఆపరేషన్లు చేయించి ఎంతో మంది పేద పిల్లలకు భవిష్యత్తును ఇచ్చింది.

ఈమె చేసిన సేవను గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించారు.. అలా సింగర్ గా ఎదిగినప్పటికీ సంగీతంతో కాకుండా ఆమె అసాధారణ మానవతా సేవా కార్యక్రమాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. పలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఇండియాలో దాదాపు 3,800 మందికి పైగా పేద పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించింది. అంతేకాదు సింగర్ పలక్ ముచ్చల్ జీవితాంతం తనకు సంగీతం ద్వారా వచ్చిన డబ్బుని ఇలా సేవా కార్యక్రమాలకు వాడతానని తెలిపింది..పలక్ ముచ్చల్ చాలా చిన్న వయసు నుండే దానధర్మాలు చేయడం ప్రారంభించింది. అలా చిన్నతనంలో ఆమె రైలు ప్రయాణం చేసే సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చూసింది.

ఆరోజు ఆ పేద పిల్లలు ఆమె జీవితాన్ని మార్చేశారు. ఆరోజు రైల్లో ఉన్న పేద పిల్లల్ని చూసి తనకు తానే ఒక శపథం చేసుకుందట. ఈ పేద పిల్లలందరికీ ఏదో ఒక విధంగా ప్రతిరోజు సహాయం చేయాలని.అలా చిన్నతనంలో పలక్ ముచ్చల్ చేసుకున్న ఆ శపథం చాలా సంవత్సరాల తర్వాత ఫౌండేషన్ రూపంలో నెరవేరింది. పలక్ పలాష్ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం కూడా ఇదేనట. పలక్ ముచ్చల్ తన కచేరి ద్వారా సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని ప్రాణాలను రక్షించే వైద్యానికి ఉపయోగిస్తుందట. కేవలం పేద పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించడం మాత్రమే కాదు గత కొద్ది సంవత్సరాలుగా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు కూడా పలక్ మద్దతుగా నిలుస్తోంది. అంతేకాదు గుజరాత్ భూకంప బాధితులకు కూడా 10 లక్షలు విరాళంగా ఇచ్చింది.

వృత్తిపరంగా సక్సెస్ అవ్వడంతో పాటు ఇలా ట్రస్టులు నడిపించడానికి ఇతరులకు సహాయం చేయడానికి ఆమె వెనక ఆమె భర్త మిథున్ కూడా ఉన్నారట. ఆమె భర్త అండగా ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైందని చెబుతుంది. తన భార్య చేసే మంచి పనుల గురించి ఓసారి మిథున్ మాట్లాడుతూ.. "కచేరీలు లేకపోయినా.. ఆదాయం రాకపోయినా పిల్లల శస్త్ర చికిత్స ఎప్పటికీ ఆగదు" అని చెప్పారు. అలా వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ దంపతులు అనుకున్న లక్ష్యాన్ని ఎక్కడా కూడా ఆపకుండా ముందుకు తీసుకువెళ్తారని ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. ఇక పలక్ ముచ్చల్ మేరీ ఆషికీ, ప్రేమ్ రతన్ ధన్ పాయో, కౌన్ తుఝే వంటి పాటలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Tags:    

Similar News