బాక్సాఫీస్ : ఇకపై కాకి లెక్కలు చెప్పలేరు?
జీఎస్టీ అధికారులు ప్రశ్నిస్తే, సినిమాకి వాస్తవంగా ఏ మేరకు కలెక్షన్లు వచ్చాయి? అనేది జెన్యూన్ గా రిపోర్ట్ ని అందించాల్సి ఉంటుంది.;
వినోద రంగంలో ఆన్ లైన్ టికెటింగ్ విధానంతో వసూళ్ల లెక్కల పరంగా పారదర్శకత సాధ్యమవుతోందా? అంటే అవుననే ప్రముఖ పంపిణీదారుడు కం నిర్మాత విశ్లేసించారు. ఇంతకు ముందులా బాక్సాఫీస్ వసూళ్ల విషయంలో కాకి లెక్కలు చెప్పడానికి లేదు. ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థ వలన వాస్తవంగా ఎన్ని టికెట్లు తెగాయో దానికి సంబంధించిన రిపోర్టును మాత్రమే అధికారులకు చూపించాల్సి ఉంటుందని విశ్లేషించారు.
జీఎస్టీ అధికారులు ప్రశ్నిస్తే, సినిమాకి వాస్తవంగా ఏ మేరకు కలెక్షన్లు వచ్చాయి? అనేది జెన్యూన్ గా రిపోర్ట్ ని అందించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో క్యాష్ ట్రాన్జాక్షన్లు పూర్తిగా తగ్గిపోయి ఆన్ లైన్ ట్రాన్జాక్షన్లు పెరగడంతో అది సినిమాల టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకతకు దారి తీసింది. జీఎస్టీ అమలు చేయడం ద్వారా పంపిణీదారులు, బయ్యర్లకు లాభాలు జీఎస్టీ సంఖ్య ఆధారంగా దక్కుతాయని ప్రముఖ తెలుగు నిర్మాత వెల్లడించారు. బుక్ మై షో ఇతర బుకింగ్ సైట్ల కారణంగా, బాక్సాఫీస్ లెక్కల్ని తప్పుగా చూపలేరని విశ్లేషించారు.
బుక్ మై షో సహా ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్స్ తమను ప్రశ్నించే అధికారులకు విధిగా టికెట్ బుకింగులపై రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. ఇదివరకటిలా క్యాష్ కలెక్ట్ చేయడం అనే సిస్టమ్ లేదు. ఇప్పుడు టికెటింగ్ వ్యవస్థ పారదర్శకంగానే ఉందని పంపిణీ రంగంలో ఉన్న ప్రముఖుడు ఒకరు తెలిపారు. సినిమా జయాపజయాల గురించి, ఒరిజినల్ బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి జీఎస్టీ- ట్యాక్స్ అధికారులకు తెలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు. ఇంతకుముందులా కాకిలెక్కలు చెప్పేందుకు అవకాశం లేదని కూడా అన్నారు.
అధికారులకు రిపోర్టులు ఇవ్వొద్దు అని నిర్మాతలు ఎగ్జిబిటర్ కి చెప్పడానికి లేదు. అధికారులు అడిగితే విధిగా ఇవ్వాల్సిందేనని కూడా తెలిపారు. ఇక మీదట ప్రతి సినిమాకు పారితోషికాలు అందుకునే విధానం కూడా మారిపోనుందని, లాభాల్లో పర్సంటేజీ బేసిస్ లోనే తారలకు పారితోషికాలు చెల్లిస్తారని కూడా ప్రముఖ నిర్మాత ఒకరు విశ్లేషించారు. మునుముందు ప్రభుత్వం తరపున అధికారిక వెబ్ సైట్ ని కూడా ప్రారంభించి ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తామని ఎఫ్.డి.సి ఛైర్మన్ దిల్ రాజు అన్నారు.