'కాంతార -1' వేదికపై తారక్ ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు?
అయితే కాంతార 1 ప్రచార వేదికపై ఎన్టీఆర్ నొప్పితో బాధపడుతూ ఇబ్బందిగా కనిపించారు. అతడు నిలబడినంతసేపు పక్కటెముకపై తన చేతిని ఉంచి సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపించింది.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన `కాంతార చాప్టర్ 1` ప్రీరిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ సాన్నిహిత్యంపై ఈ సందర్భంగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది. తారక్ రాకతో కాంతార -1 కి అదనపు బూస్ట్ వచ్చిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శక నటుడు రిషబ్ ని సార్ అని ప్రస్థావిస్తూ తారక్ స్పీచ్ ఇచ్చారు. తారక్ పై రిషబ్ అభిమానం అందరినీ ఆకట్టుకుంది.
అయితే కాంతార 1 ప్రచార వేదికపై ఎన్టీఆర్ నొప్పితో బాధపడుతూ ఇబ్బందిగా కనిపించారు. అతడు నిలబడినంతసేపు పక్కటెముకపై తన చేతిని ఉంచి సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపించింది. ఎక్కువసేపు మాట్లాడాలని ఉన్నా నిలబడే ఓపిక లేదని కూడా తారక్ అన్నారు. ఎన్టీఆర్ ఇటీవలే సెట్స్ లో గాయపడిన సంగతి తెలిసిందే. `డ్రాగన్` చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దానికి చికిత్సతో కోలుకుంటున్నారు. అయినా గాయం కారణంగా నొప్పి కొంత ఇబ్బంది పెడుతోంది. అయితే తారక్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రార్థిస్తున్నారు.
కాంతార పాన్-ఇండియాలో విజయం సాధించిన తర్వాత, రిషబ్ శెట్టి ప్రీక్వెల్ కథతో కాంతారా: చాప్టర్ 1 ని తెరకెక్కించారు. మరోసారి దర్శకుడిగా కొనసాగుతూనే, నటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ప్రఖ్యాత హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
పురాణాలు, జానపదాలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా `కాంతార: చాప్టర్ 1` ని రిషబ్ ఒక అద్భుత దృశ్యకావ్యంగా రూపొందించారని ప్రచారమవుతోంది. ఈ దసరా సీజన్ లో కాంతార చాప్టర్- 1 భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.