సీనియర్ ఎన్టీఆర్ ఇల్లు...ఒక అద్భుత సందర్శన కేంద్రంగా
ఇక అన్న గారు 1982లో టీడీపీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తొమ్మిది నెలల పాటు ఉమ్మడి ఏపీ రోడ్ల మీదనే తిరిగారు.;
నందమూరి తారక రామారావు మూడు దశాబ్దాలకు పైగా గడిపిన ఒక అందమైన ఇల్లు అది. ఆయన కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా అందులోనే ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం చేస్తూ అది నచ్చక మానేసిన ఎన్టీఆర్ నటుడు కావాలని బలమైన కోరికతో మద్రాస్ రైలెక్కారు. అలా 1949లో మనదేశం సినిమాతో ఒక కానిస్టేబుల్ పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత తన టాలెంట్ పూర్తిగా చూపించారు. దాంతో అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి. మద్రాస్ కి వచ్చిన కొత్తలో స్నేహితులతో కలసి ఒక రూమ్ లో ఉండే ఆయన కేవలం నాలుగేళ్ళు తిరగకుండానే 1953లో వేయి గజాల స్థలాన్ని కొనుగోలు చేసి సువిశాలంగా సొంతిల్లు తన అభిరుచికి అనుగుణంగా నిర్మాణం చేసుకున్నారు. అందులోనే ఆయన నటుడిగా తన కెరీర్ మొత్తం కాపురం ఉన్నారు.
తిరుపతి తర్వాత :
ఆ ఇల్లు ఎంతటి ప్రాముఖ్యత సాధించింది అంటే తిరుపతి వెళ్ళిన భక్తులు ఆ తరువాత ప్రత్యేక బస్సులో వెళ్ళి మరీ అన్న గారిని ఆయన ఇంటి వద్ద చూసి వెనుదిరిగేవారు. మద్రాస్ లోని బజుల్లా రోడ్డు అంటే అన్న గారి ఇల్లు అని పేరు పడింది. ఆ ఇంటి నుంచే మేకప్ వేసుకుని ఎన్నో సినిమాలలో ఎన్టీఆర్ పాత్ర ధారణ చేశారు. ఎంతో మంది నిర్మాతలు దర్శకులు నటులు అంతా ఆ ఇంటికి వచ్చేవారు. రామారావు మొత్తం 12 మంది సంతాకం అంతా అక్కడే పుట్టి పెరిగారు. ఎన్నో శుభాలకు మరెన్నో మధుర జ్ఞాపకాలకు ఆ ఇల్లు ఒక నిట్ట నిలువు నిదర్శనంగా ఉంటూ వచ్చింది. ఇక అన్న గారు తొలిసారిగా కొనుక్కున్న కారు నుంచి ఆయన చివరి సారిగా కొన్న కారు కూడా అక్కడే ఉంది.
రాజకీయాల్లోకి వచ్చాక :
ఇక అన్న గారు 1982లో టీడీపీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తొమ్మిది నెలల పాటు ఉమ్మడి ఏపీ రోడ్ల మీదనే తిరిగారు. ఆ తరువాత ఆయన 1983లో సీఎం అయిపోయారు. దాంతో ఆయన నివాసం హైదరాబాద్ అబీడ్స్ కి మారిపోయింది. అలా ఆయన పాత ఇల్లు ఒక జ్ఞాపకంగా కాలం మరుగున ఉండిపోయింది. ఆ ఇంటి విషయం చూస్తే ఒకనాడు వైభోగం అంతా చూసినది ఇపుడు కళావిహీనంగా మారింది.
పూర్వ వైభవం కోసం :
ఇదిలా ఉంటే అన్న గారు మసలిన ఇల్లు, ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన ఇల్లు, తెలుగు వారి నిలువెత్తు సంతకంగా ఉన్న ఎన్టీఆర్ నివాసం అంటే ఎంతో భక్తితో ఆ ఇంటిని తీసుకోవాలని ఆయనకు అత్యంత సన్నిహితులు అయిన ప్రముఖ నిర్మాతలు చదలవాడ సోదరులు శ్రీనివాసరావు, తిరుపతిరావు నిర్ణయించారు. ఈ మేరకు వారు నందమూరి వంశీకుల నుంచి ఈ మధ్యనే ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటికి సంబంధించి మొత్తం ముప్పయి మంది దాకా వారసులు ఉంటే అంతా వచ్చి సంతకాలు పెట్టి ఆ ఇంటి అమ్మకం ప్రక్రియను పూర్తి చేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు.
భక్తితోనే కొన్నామంటూ :
ఆ ఇంటిని తాము కొనుగోలు చేసింది వ్యాపారం కోసం కాదని కేవలం అన్న గారి మీద భక్తితోనే అని చదలవాడ సోదరులు చెబుతున్నారు. ఆ ఇంటిని తాము ఆధునీకరిస్తామని వారు చెబుతున్నారు. దీని కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బర్మా టేకు కలపను కూడా మద్రాస్ లోని ఇంటికి తరలిస్తున్నారు. ఈ ఇంటిని ఎన్టీఆర్ అభిమానుల కోసం అని వారు చెబుతున్నారు. భవిష్యత్తులో వచ్చే అన్న గారి ఫ్యాన్స్ అంతా ఆ ఇల్లు చూడాలని ఆయన పేరుతో ఒక అందమైన జ్ఞాపకంగా దానిని మలచాలని చూస్తున్నామని చెప్పారు. ఇక ఆ ఇంటిని అభిమానుల సందర్శన కోసం ఎలాంటి రుసుము కూడా వసూలు చేయమని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే సాధ్యమైనంత తొందరలోనే అన్న గారి ఇల్లు సరికొత్త హంగులతో అధ్బుతంగా తయారై ఆయన అభిమానుల కోసం తెలుగు వారి భవిష్యత్తు తరాల కోసం కనువిందు చేసేందుకు సిద్ధం అవుతోంది అన్న మాట. ఇది నిజంగా సీనియర్ ఎన్టీఆర్ కి గొప్ప గౌరవంగానే చూడాల్సి ఉంది.