పుట్టిన‌రోజున చిలకలతో క్యూట్ పోస్ట్‌.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్!

అంతేకాదు ఆ పక్షుల ఫోటోలను కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలకు ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Update: 2026-05-20 10:56 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షల సందడితో మార్మోగుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, నెటిజన్లు ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్ నుంచి రిలీజైన గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డు స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

 

ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్, ప్రశాంత్ నీల్ టేకింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌లో భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. అయితే ఈసారి బర్త్‌డే స్పెషల్‌గా సినిమాకి సంబంధించిన అప్డేట్ కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం మాత్రం ఎన్టీఆర్ షేర్ చేసిన ఓ క్యూట్ ఫోటో. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఎన్టీఆర్ రెండు పెద్ద చిలకలతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

అంతేకాదు ఆ పక్షుల ఫోటోలను కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలకు ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. నా పక్షులను పరిచయం చేస్తున్నాను. వాటి పేర్లు అసహి, యూహి. జపాన్ పట్ల నాకున్న ప్రేమను ప్రతిబింబించే పేర్లు ఇవి.. అంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆ చిలకలకు పెట్టిన పేర్లు జపనీస్ నేపథ్యాన్ని గుర్తు చేస్తుండటంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ మొదలైంది.

సాధారణంగా స్టార్ హీరోలు తమ పెంపుడు జంతువులతో ఫోటోలు షేర్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ఎన్టీఆర్ తన వ్యక్తిగత అభిరుచిని, జపాన్ పట్ల ఉన్న అనుబంధాన్ని ఇలా ఓ చిన్న పోస్ట్ ద్వారా తెలియజేయడం అభిమానులకు మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జపాన్‌లో ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించడంతో ఎన్టీఆర్‌కు జపనీస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తరువాత ఎన్టీఆర్ పలుమార్లు జపాన్ పర్యటనకు వెళ్లడం కూడా వార్తల్లో నిలిచింది. అక్కడి సంస్కృతి, ప్రజల ప్రేమ తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన పెంపుడు చిలుకలకు కూడా జపనీస్ పేర్లు పెట్టడం ద్వారా ఆ అనుబంధాన్ని మరోసారి బయటపెట్టారు. బర్త్‌డే రోజున మాస్ గ్లింప్స్‌తో పాటు ఇలా ఒక సాఫ్ట్, క్యూట్ మూమెంట్‌ను ఫ్యాన్స్ తో పంచుకోవడం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కెరీర్ పరంగా కూడా అత్యంత బిజీ దశలో ఉన్నారు. ఒకవైపు డ్రాగన్‌పై భారీ అంచనాలు ఉండగా, మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్ట్స్, పాన్ ఇండియా మార్కెట్‌లో ఆయన రేంజ్ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన షేర్ చేసిన ఈ సింపుల్ పోస్ట్ కూడా అభిమానులకు మరింత దగ్గర చేసింది. మాస్ హీరో అయినా మనసులో ఎంతో సాఫ్ట్ నేచర్ ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అసహి, యూహి పేర్లతో ఉన్న ఆ చిలకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News