శివాజీ అనసూయ ఇష్యూ.. సోషల్ మీడియా ఐడెంటిటీ కోసమా?
హీరోయిన్స్ బట్టలపై శివాజీ కామెంట్స్, దానికి అనసూయ ఇచ్చిన కౌంటర్లతో మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.;
హీరోయిన్స్ బట్టలపై శివాజీ కామెంట్స్, దానికి అనసూయ ఇచ్చిన కౌంటర్లతో మొదలైన వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మొదట టాలీవుడ్ వరకే పరిమితమైన ఈ చర్చ, ఇప్పుడు నేషనల్ మీడియా వరకు పాకింది. జాతీయ స్థాయి మీడియా ఛానల్స్ లో కూడా దీనిపై కథనాలు వస్తుండటంతో వ్యవహారం మరింత ముదిరింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ పై సామాన్య ప్రజలు, నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు విషయం పక్కకు వెళ్లి, సోషల్ మీడియా అటెన్షన్ కోసమే ఈ రచ్చ జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఏంటంటే.. ప్రస్తుతం ఇటు శివాజీకి కానీ, అటు అనసూయకి కానీ చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేవు. ఇద్దరూ కెరీర్ పరంగా కాస్త ఖాళీగానే ఉన్నారు. అందుకే జనం మర్చిపోకుండా ఉండటానికి, తమ ఉనికిని చాటుకోవడానికే ఈ ఇష్యూని ఇంతలా డ్రాగ్ చేస్తున్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ తర్వాత శివాజీకి, టీవీ షోల తర్వాత అనసూయకి సోషల్ మీడియానే ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది.
ఒకరు ఒక మాట అనడం, దాన్ని పట్టుకుని మరొకరు స్పందించడం, ఆ తర్వాత దానికి మళ్లీ కౌంటర్లు ఇచ్చుకోవడం.. ఇలా ఇది ఒక చైన్ ప్రాసెస్ లా మారిపోయింది. దువ్వాడ జంట, చిన్మయి, కరాటే కళ్యాణ్ RJ భాష లాంటి వారు కూడా రెండు వైపులా వాదనలతో వివాదాన్ని మరింత హైలెట్ చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో హాట్ టాపిక్స్ నడుస్తున్నా, వాటిని కూడా పక్కకు నెట్టేసి మరీ ఈ ఇష్యూ ట్రెండింగ్ లోకి వచ్చింది.
దీన్ని బట్టి చూస్తే జనం అటెన్షన్ మొత్తం తమ మీదే ఉండాలనే తాపత్రయం ఇద్దరిలోనూ కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది శివాజీకి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు అనసూయకు మద్దతు ఇస్తున్నారు. నిజానికి శివాజీ తను అన్న మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. తన ఉద్దేశం అది కాదని వివరణ ఇచ్చారు. అలాగే అనసూయ కూడా తన అభ్యంతరాలను, అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడితో ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడాల్సింది.
కానీ రోజులు గడుస్తున్నా ఇంకా దీని మీద వీడియోలు, పోస్టులు పెడుతుండటం చూస్తుంటే జనాలకు కూడా చిరాకు వస్తోంది. ఇష్యూని సాగదీయడం వల్ల ఇద్దరికీ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ పెరుగుతుందేమో కానీ, ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవుతోందనే మాట వినిపిస్తోంది. నేషనల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అవ్వడంతో, టాలీవుడ్ పరువు కూడా చర్చనీయాంశంగా మారింది. బయట వాళ్లకు మన ఇండస్ట్రీలో ఏదో గొడవలు జరుగుతున్నాయనే సంకేతాలు వెళ్తున్నాయి.
సమస్య పరిష్కారం కంటే, తమ వాదనే నెగ్గాలనే పంతం ఇద్దరిలోనూ కనిపిస్తోంది. ఇది మహిళల భద్రత, గౌరవం అనే పాయింట్ నుంచి వ్యక్తిగత దూషణల స్థాయికి పడిపోవడం విచారకరం అనే కామెంట్స్ వస్తున్నాయి. చివరగా సోషల్ మీడియా జనం కోరుకుంటుంది ఒక్కటే.. ఈ వివాదానికి ఇకనైనా ముగింపు పలకాలని. ఇద్దరూ ఎవరికి వారు తమ పనులపై దృష్టి పెడితే మంచిదని, లేదంటే ఈ రచ్చ వల్ల చివరికి సెల్ఫ్ మిగిలేది డ్యామేజ్ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.