'మనీ హీస్ట్' టీజింగ్: ఈ కొత్త ట్విస్టును ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదే!

ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన స్పెయిన్ డ్రామా `మనీ హీస్ట్` అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.;

Update: 2026-05-11 08:52 GMT

ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన స్పెయిన్ డ్రామా `మనీ హీస్ట్` అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. 2019లో మొదలై 2022లో ఐదు సీజన్లతో ముగిసిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని నెట్‌ఫ్లిక్స్ హింట్ ఇచ్చింది. తాజాగా ఆదివారం నాడు విడుదల చేసిన ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అసలు `మనీ హీస్ట్ సీజన్ 6` రాబోతుందా? లేక కొత్త స్పిన్-ఆఫ్‌లు రానున్నాయా? అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ప్రకటనలో `రెవల్యూషన్ నెవర్ ఎండ్స్` (విప్లవం ఎప్పటికీ ముగియదు) అంటూ ఈ యూనివర్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు హింట్ ఇస్తూ టీజ్ చేసింది. స్పెయిన్ బ్యాంక్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని కొల్లగొట్టిన ఆ అద్భుతమైన దోపిడీ ప్రయాణం కొత్త పుంతలు తొక్కబోతోందని తాజా టీజ‌ర్ ధృవీక‌రించింది. `మనీ హీస్ట్` ప్రపంచం నిరంతరం పెరుగుతూ.. పరిణామం చెందుతూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వివరించింది. అయితే ఇది నేరుగా ఆరవ సీజన్ అవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంచింది.

ప్రస్తుతానికి అందరి దృష్టి ప్రొఫెసర్ సోదరుడు బెర్లిన్ పాత్రపై రూపొందిన `బెర్లిన్` సిరీస్‌పై ఉంది. ఈ స్పిన్-ఆఫ్ సిరీస్ రెండో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పెడ్రో అలోన్సో ప్రధాన పాత్రలో నటిస్తున్న `బెర్లిన్ సీజన్ 2` ప్రపంచవ్యాప్తంగా `2026 మే 15న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ విడుదలైన తర్వాతే మనీ హీస్ట్ మెయిన్ స్టోరీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

బెర్లిన్ రెండో సీజన్‌లో పాత పాత్రలతో పాటు పలువురు కొత్త నటులు కూడా సందడి చేయనున్నారు. మిచెల్ జెన్నర్, ట్రిస్టన్ ఉల్లోవా వంటి నటులు తమ పాత్రలను పునరావృతం చేస్తున్నారు. మొదటి హీస్ట్ నుండి శతాబ్దపు అత్యంత కళాత్మక దోపిడీ వరకు ఈ ప్రయాణం సాగిందని... భవిష్యత్తులో తెర‌కెక్కే కథలు కూడా అదే స్థాయిలో ఉత్కంఠను కలిగిస్తాయని టీజర్ ద్వారా అర్థమవుతోంది. దోపిడీల వెనుక ఉన్న ఆ తెలివితేటలు, ఎమోషన్స్ మళ్ళీ తెరపైకి రానున్నాయని ఈ టీజింగ్ వీడియో స్పష్టం చేస్తోంది.

మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ చేసిన ఈ ప్రకటనతో `మనీ హీస్ట్` ఫ్యాన్ బేస్ మళ్ళీ యాక్టివ్ అయింది. సీజన్ 6 వచ్చినా లేదా కొత్త క్యారెక్టర్ల మీద మరిన్ని స్పిన్-ఆఫ్‌లు వచ్చినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. బెర్లిన్ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో ఈ యూనివర్స్ నుండి రానున్న‌ తదుపరి అప్‌డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. హీస్ట్ ఇంకా ముగియలేదు.. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.



Tags:    

Similar News