నయనతార పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

అయితే ఈ ప్రచారంపై నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు.

Update: 2026-10-13 03:33 GMT

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ `తమిళగ వెట్రి కళగం` (TVK) పార్టీ ద్వారా సాధించిన విజయం తర్వాత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, త్రిష కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ ప్రచారం జోరందుకుంది. గతంలో తమిళనాడులో పురట్చి తలైవి జయలలిత లాంటి దిగ్గజ నటి రాజకీయాధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన సంచలన చరిత్ర ఉంది. ఈ క్రమంలోనే నయనతార కూడా రానున్న‌ 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ఊహాగానాలు సినీ- రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ ప్రచారంపై నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తమ దృష్టంతా పూర్తిగా కుటుంబం - వృత్తిపరమైన కెరీర్‌పైనే ఉందంటూ పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు ముగింపు పలికారు. ప్రస్తుతం నయనతార తల్లిగా తమ పిల్లల పెంపకాన్ని, త‌ల్లిగా ఆనందాన్ని ఎంతో ఆస్వాధిస్తోందని.. వారి భవిష్యత్తుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని విఘ్నేష్ శివన్ వెల్లడించారు.

తమ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే తమకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. ఆయన తాజా ప్రకటనతో నయనతారకు ఎలాంటి రాజకీయ ప్రణాళికలు లేవని.. ఎన్నికల్లో పోటీ చేసే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే.. మరోవైపు నయనతార వరుస పాన్-ఇండియా సినిమాలతో నటిగా తన కెరీర్‌ను ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు.

రాజకీయ ప్రవేశం వార్తలను పక్కన పెడితే.. నయనతార ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. నటిగా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం, నిర్మాణానంతర దశల్లో ఉన్న పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

న‌య‌న్ నటిస్తున్న తాజా చిత్రాల వివరాలను పరిశీలిస్తే... సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భక్తిరస ఫాంటసీ చిత్రం `మూకుత్తి అమ్మన్ 2`లో నయనతార అమ్మ‌వారి పాత్రలో అలరించనున్నారు. దీనితో పాటు మలయాళం-తమిళ్ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న `డియర్ స్టూడెంట్స్` లో విద్య రుద్రన్ పాత్రను పోషిస్తుండగా... పీరియడ్ యాక్షన్ డ్రామా `రక్కాయి`, అలాగే విభిన్న కథాంశంతో వస్తున్న `మన్నంగట్టి సిన్స్ 1960` .. టాలీవుడ్ అగ్ర నిర్మాణ‌ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ రూపొందిస్తున్న #SVC63 వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు నయనతార లైనప్‌లో ఉన్నాయి.

Tags:    

Similar News