డాక్టరేట్ కోసం పోరాటం మాత్రం ఆపనంటోంది!
సినీ పరిశ్రమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం.. వారిదైన కలలు ఉంటాయి.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరి వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం.. వారిదైన కలలు ఉంటాయి. కొంతమంది అనుకోకుండా ఇండస్ట్రీలోకి వస్తే.. మరికొందరు లక్ష్యాలను పక్కన పెట్టి నటనపై మక్కువతో ఇక్కడే స్థిరపడతారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దివి విద్యత విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. వెండితెరపై గ్లామర్ పాత్రలతో.. విభిన్న నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న భామ వెనుక ఓ బలమైన విద్యా నేపథ్యం.. నెరవేరని ఓ పెద్ద కల దాగి ఉంది. సినిమాల పట్ల ఉన్న ప్యాషన్‌తో కెరీర్ మార్గాన్ని మార్చుకున్నా? తన అసలైన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని తాజాగా వెల్లడించారు.
దివి విద్యత కుటుంబ నేపధ్యం పూర్తిగా విద్యా రంగానికి సంబంధించినది. ఆమె తండ్రి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశారు. అయినప్పటికీ తన కుటుంబంలో చదువుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. కష్టపడి తన భార్యను డాక్టరేట్ చేసేలా ప్రోత్సహించారు. అలాగే కొడుకును కూడా ఉన్నత చదువులు చదివించి డాక్టరేట్ సాధించేలా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆమె కుటుంబంలో తండ్రి ప్రోత్సాహంతో డాక్టరేట్ పూర్తి చేసిన ఇద్దరు సభ్యులు కాలేజీల్లో ప్రొఫెసర్లుగా ఉన్నత స్థానాల్లో సేవలనందిస్తున్నారు. ఇంట్లో అందరూ విద్యాధికులే కావడంతో దివి కూడా పీహెచ్‌డీ పూర్తి చేసి ఓ ప్రొఫెసర్ కావాలని కలలు కన్నారు.
అయితే విధి ఆమెను మరో మార్గంలో నడిపించింది. చదువుపై పూర్తి దృష్టి పెట్టాల్సిన సమయంలో మోడలింగ్, సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా దివి అనుకోకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాల్సి వచ్చింది. గ్లామర్ ప్రపంచం ఇచ్చిన అవకాశాలు, నటనపై ఉన్న మక్కువ ఆమెను సినిమాల వైపు పరుగులు పెట్టించాయి. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ అటుపై వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఈ హడావుడిలో విద్యాభ్యాసం కాస్త వెనుకబడిపోవడంతో తాను అనుకున్నట్లుగా డాక్టరేట్ సంపాదించలేకపోయానని దివి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.
కుటుంబంలో అందరి పేర్ల ముందు డాక్టర్ అనే గౌరవప్రదమైన బిరుదు ఉండటం, తానొక్కటే ఆ విషయంలో వెనుకబడిపోవడం ఎంతగానో ఆలోచింపజేసిందట. ప్రొఫెసర్ కావాలనే కలను సినిమా రంగంలో బిజీగా ఉండటం వల్ల తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చినా? మనసులో కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందన్నారు. సినిమాల్లో రాణిస్తూనే.. చదువును మళ్లీ కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. సరదాకోసం కాకుండా తన పేరు పక్కన డాక్టరేట్ తగిలించుకోవడం కోసం భవిష్యత్తులో ఖచ్చితంగా పీహెచ్‌డీ పూర్తి చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
ఒకవైపు గ్లామర్ ప్రపంచంలో పోటీని ఎదుర్కొంటూనే.. మరోవైపు కుటుంబం సాధించిన విద్యా శిఖరాలను తాకాలనే తపన పడటం నిజంగా అభినందనీయం. సాధారణ కుటుంబం నుండి వచ్చి.. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు చదువుపై మక్కువను చంపుకోని దివి పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకం. ఇండస్ట్రీ కేవలం నటనకే పరిమితం కాదని వ్యక్తిగత ఎదుగుదలకు, విద్యకు కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో? దివి మాటలు నిరూపిస్తున్నాయి.