తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌తో విజయ్-రష్మిక ఆత్మీయ భేటీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా పీరియడ్ యాక్షన్ డ్రామా `రణబాలి` ప్రమోషన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా పీరియడ్ యాక్షన్ డ్రామా `రణబాలి` ప్రమోషన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. బ్రిటిష్ పాలన కాలంనాటి నేపథ్యంలో, భారతీయ చరిత్రలో మరుగునపడిన పోరాట ఘట్టాలు, సామాన్యుల త్యాగాల ఇతివృత్తంగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ భారీ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ పాన్-ఇండియా చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ ప్రమోషనల్ టూర్‌లో భాగంగా చెన్నైకి వెళ్లిన విజయ్ దేవరకొండ, రష్మికల జంట తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్)ని మర్యాదపూర్వకంగా కలిశారు. రోజు మొత్తం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సీఎం విజయ్ తమను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి మాట్లాడారని విజయ్ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కాగా.. ఒక్క సమావేశంతోనే సీఎం విజయ్ గారు తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారని విజయ్ దేవరకొండ కొనియాడారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళ, భారతీయ సినీ ప్రముఖులు ఆయనను వరుసగా కలుస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఇదివరకూ దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఎ.ఆర్. మురుగదాస్, కె. భాగ్యరాజ్ తో పాటు నటులు ప్రశాంత్, అర్జున్ సర్జా, శివకార్తికేయన్, సంతను భాగ్యరాజ్, నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఖుష్బూ సుందర్ వంటి పలువురు సినీ ప్రముఖులు సీఎం విజయ్‌ని ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
`రణబలి` విశేషాల విషయానికొస్తే... ఈ సినిమాలో తన పాత్ర శైలి కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా గుర్రపు స్వారీతో పాటు రాయలసీమ మాండలికంలో శిక్షణ పొంది నటించారు. వాస్తవిక యాక్షన్ సన్నివేశాలు, జానపద సంగీతం, బలమైన భావోద్వేగాల మేళవింపుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక జయమ్మ అనే శక్తివంతమైన పాత్రను పోషించగా, హాలీవుడ్ నటుడు, ది మమ్మీ ఫేం ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ధరలు పెంచడం లేదని విజయ్ తెలపడం విశేషం.
చారిత్రక నేపథ్యం, భావోద్వేగమైన కథాంశం .. భారీ విజువల్ ప్రమాణాలతో రూపొందిన `రణబాలి` థియేటర్లలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.