నయనతారకు ఇలాంటి పాత్రలంటేనే మోజా?
ఇప్పుడు మళ్ళీ చిరు మూవీలో అలాంటి క్యారెక్టర్ చేసిన నేపథ్యంలో ఒక ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో తిరుగుతోంది.;
రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ నయనతారది. మొదట్లో జస్ట్ ఇంకో గ్లామర్ హీరోయిన్ లాగే కనిపించేది ఈ మలయాళ భామ. కానీ తర్వాతి రోజుల్లో నటిగా గొప్ప పేరు సంపాదించి, కథానాయికగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించి తన లెవెలే వేరు అని రుజువు చేసింది. ప్రస్తుతం ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తూనే.. ఇంకోవైపు టాప్ స్టార్ల సరసన నటిస్తూ విజయాలు అందుకుంటోంది.
తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారులో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకు దీటైన పాత్ర, నటనతో మెప్పించింది నయన్. అయితే ఇందులో ఆమె చేసింది కొత్త క్యారెక్టర్ అయితే కాదు. ఆ టైపు పాత్రలు తనకు బాగా అలవాటే.
పెళ్ళయ్యాక భర్త తీరు నచ్చక, తనతో విభేదాలు తలెత్తి విడిపోవడం, పిల్లల్ని కూడా భర్తతో కలవనివ్వకుండా చూడడం, తన కాళ్ల మీద తను నిలబడడం.. చివరికి మళ్ళీ భర్తను అర్థం చేసుకుని తనతో కలిసిపోవడం.. ఇదీ మన శంకర వరప్రసాద్ గారులో నయన్ పాత్ర తీరు. అచ్చం ఇలాంటి పాత్రనే అజిత్ మూవీ విశ్వాసంలో చేసింది నయన్. అంతకు ముందు వెంకటేష్ చిత్రం తులసిలోనూ తన పాత్ర ఇలాగే ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ చిరు మూవీలో అలాంటి క్యారెక్టర్ చేసిన నేపథ్యంలో ఒక ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. భర్త నుంచి విడిపోయి పిల్లల్ని తనతో కలవకుండా చేసే క్యారెక్టర్ అని ఏ దర్శకుడైనా తన పాత్ర గురించి చెబితే.. ఈ సినిమా మనం చేస్తున్నాం అని నయన్ ఓకే చెప్పేస్తుంది అన్నట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. భలే ఫన్నీగా ఉన్న ఈ మీమ్ నవ్వుకు పోయిస్తోంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో బాగా కనెక్ట్ అయిన నయన్.. ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం కోసం ప్రమోషనల్ వీడియోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.