నేషనల్ అవార్డ్స్ విషయంలో ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందా?
తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సినిమా ప్రేమికుల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.
తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సినిమా ప్రేమికుల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. కార్తీక్ ఆర్యన్, శ్రీకాంత్ వంటి చిత్రాలు అవార్డులు గెలుచుకోవడం ఆనందాన్నిచ్చినా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు చిత్రాలను జ్యూరీ పూర్తిగా విస్మరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా వందల కోట్ల వసూళ్లతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన మలయాళ చిత్రాలు 'మంజుమ్మల్ బాయ్స్', 'ఆవేశం', 'ప్రేమలు' వంటి సరికొత్త కంటెంట్ ఉన్న సినిమాలకు ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం, అవార్డుల ఎంపిక ఫార్ములాపై పెను అనుమానాలను రేకెత్తిస్తోంది.
పాతకాలపు అవార్డు ఫార్ములాలకే జ్యూరీ ఓటు వేస్తోందా?:
ఈ ఏడాది అవార్డుల జాబితా చూశాక ప్రతి ఒక్కరి మైండ్‌లో మెదిలే ప్రశ్న.. జాతీయ అవార్డులు కేవలం ఆర్ట్ ఫిల్మ్స్ లేదా హెవీ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలకే పరిమితమా? అని. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించి, వారిని మైండ్ బ్లాక్ చేసేలా అలరించిన కమర్షియల్, టెక్నికల్ వండర్స్‌ను జ్యూరీ ఎందుకు లైట్ తీసుకుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కేవలం ఒక నిర్దిష్టమైన చట్రంలో ఉండే సినిమాలకే అవార్డులు ఇస్తూ పోతే.. కమర్షియల్ సినిమాల్లో ఉండే అసలైన ప్రతిభకు గుర్తింపు ఎప్పుడు దక్కుతుందనేది మిస్టరీగా మారింది.
'రంగభాయ్' కల్చరల్ ఇంపాక్ట్‌ను తక్కువంచనా వేశారా?:
'ఆవేశం' సినిమాలో ఫహద్ ఫాజిల్ పోషించిన 'రంగా' రంగభాయ్ పాత్ర సృష్టించిన పాప్-కల్చర్ ఐకాన్ ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఆ పాత్ర సృష్టించిన కల్చరల్ వేవ్ ఒక సంచలనం. అలాగే ఒక సింపుల్ రొమాంటిక్ కామెడీతో వచ్చి భారీ కమర్షియల్ అండ్ క్రిటికల్ సక్సెస్ సాధించిన 'ప్రేమలు' గానీ, ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సాంకేతిక ప్రమాణాలతో గుండెలను పిండేసిన 'మంజుమ్మల్ బాయ్స్' గానీ అవార్డుల రేసులో ఎక్కడా కనిపించకపోవడం విచారకరం. ఇక కేవలం అవార్డు ఫార్ములాకు సరిపోలేదనే కారణంతో ఇంతటి ప్రతిభను పక్కన పెట్టడం అన్యాయమే.
విమర్శకుల ప్రశంసలు పొందినా దక్కని గుర్తింపు:
కేవలం సౌత్ సినిమాలే కాదు.. బాలీవుడ్‌లో సరికొత్త ఆలోచనలతో, వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో వచ్చిన కిరణ్ రావు 'లాపాతా లేడీస్', ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో దిల్జిత్ దోసాంజ్ అద్భుతంగా నటించిన 'అమర్ సింగ్ చంకీలా' చిత్రాలకు కూడా నిరాశే ఎదురైంది. ఇక 'మైదాన్' సినిమాలో ఫుట్‌బాల్ కోచ్‌గా అజయ్ దేవగన్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆయనను జ్యూరీ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ చిత్రాలన్నీ అవార్డుల కంటే ప్రేక్షకుల ఆదరణే పెద్దదని నిరూపించినా, జాతీయ వేదికపై వీటికి సరైన గౌరవం దక్కలేదన్నది వాస్తవం.
జాతీయ అవార్డుల ఎంపిక అనేది పూర్తిగా జ్యూరీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. వారి దృక్కోణం వేరుగా ఉండొచ్చు, కానీ సినిమా సాధించిన సాంస్కృతిక ప్రభావం, ప్రేక్షకుల గుండెల్లో అది సంపాదించుకున్న స్థానం టోకెన్ ట్రోఫీల కంటే చాలా పెద్దవి. అవార్డులు రాకపోయినా ఈ ప్రతిభావంతుల చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అయితే, రాబోయే రోజుల్లో అయినా జ్యూరీ పాత ఫార్ములాలను వీడి, మారుతున్న సినిమా ట్రెండ్‌ను, కమర్షియల్ సినిమాల్లోని వినూత్న ప్రతిభను గుర్తిస్తుందని ఆశిద్దాం..