అతిపెద్ద సినిమా టైటిల్.. కథలో అసలు మిస్టరీ ఇదే
‘ఎ ఫర్బిడెన్ రాగ్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ సాగ’ అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. సెప్టెంబర్ 18న సినిమా థియేటర్లలోకి రానుంది.
తెలుగు సినిమాల్లో ఇంత పొడవైన టైటిల్ ఎప్పుడైనా చూశామా అనిపించేలా చంద్ర సిద్ధార్థ్ కొత్త సినిమా సిద్ధం చేస్తున్నారు. ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే పేరుతో ఈ సినిమా వస్తోంది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌గా దీనిని మేకర్స్ చెబుతున్నారు. ‘ఎ ఫర్బిడెన్ రాగ్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ సాగ’ అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. సెప్టెంబర్ 18న సినిమా థియేటర్లలోకి రానుంది.
ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని వై.వి. సత్యనారాయణ రాజు సమర్పిస్తున్నారు. కథ మాత్రం దివంగత దర్శకుడు, రచయిత మదన్‌ది. ‘ఆ నలుగురు’ కథను మదన్ రాయగా, చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించారు. ఇప్పుడు మదన్ చివరిగా ప్లాన్ చేసిన కథను కూడా చంద్ర సిద్ధార్థే సినిమాగా పూర్తి చేశారు. మదన్ అనుకున్న కథను తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లినట్టు దర్శకుడు చెప్పారు.
హర్ష ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అమ్మైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అనిరుధ్ శ్రీవాస్తవ, అశోక్ వర్ధన్, రేఖ నిరోషా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చంద్ర సిద్ధార్థ్ సినిమాలు అంటే రిలేషన్‌షిప్స్, మనుషుల మధ్య ఎమోషన్స్ ఎక్కువగా గుర్తొస్తాయి. ఈసారి మాత్రం సైకాలజికల్ థ్రిల్లర్‌ను మిస్టరీ మ్యూజికల్‌గా తీసుకొస్తున్నారు. కథలో ప్రేమ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, జ్ఞాపకాలతో ముడిపడిన మరో లేయర్ కూడా ఉంటుంది.
ఇందులో మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండదట. సౌండ్ థెరపీ, న్యూరో సైన్స్, బ్రెయిన్ మ్యాపింగ్ కూడా కథలో భాగమే అని చెబుతున్నారు. ప్రతి రాత్రి పదిన్నర గంటలకు ఒక రేడియో స్టేషన్‌లో ఒక పాట ప్రసారం అవుతుంది. నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి ఇంకా మరికొందరు ఆ పాటను కోరుతుంటారు. రోజూ అదే సమయంలో ఆ పాట ఎందుకు వస్తోంది, ఆ పేర్ల వెనుక ఎవరు ఉన్నారు అన్నదే కథలోని మిస్టరీ.
సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. జె రెక్స్ సంగీతం అందించగా, పాటల సాహిత్యాన్ని చంద్ర సిద్ధార్థ్ స్వయంగా రాశారు. స్క్రీన్‌ప్లే కూడా ఆయనే చూసుకున్నారు. పులగం చిన్నారాయణ డైలాగ్స్ అందించారు. సామ్ సుప్రీత్ సినిమాటోగ్రఫీ, గిరిధర్ చంద్రమౌళి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అగస్త్య మంజు సహ నిర్మాతగా, సత్య నెక్కలపు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అంజి కొయ్యాల ఆర్ట్ డైరెక్టర్.
ఇది తనకు రెగ్యులర్ సినిమా కాదు అని చంద్ర సిద్ధార్థ్ చెబుతున్నారు. మ్యూజిక్‌ను కథలో ఒక భాగంగా పెట్టి, మిస్టరీని వేరే ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశానని ఆయన చెబుతున్నారు. మదన్ ఈ కథను సినిమాగా చూడాలని అనుకున్నారని, ఆయన కోరికను పూర్తి చేయాలనే బాధ్యత కూడా తనపై ఉందని చంద్ర సిద్ధార్థ్ చెప్పారు.