ఓటీటీ, శాటిలైట్ చానల్స్‌కి యూట్యూబ్ బిగ్ షాక్..!
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీఫిల్మ్స్ తో యూట్యూబ్ ఇండియా ప్రతినిధులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఇంటర్నెట్ తెలిసిన ప్రతి ఒక్కరికీ యూట్యూబ్ తెలిసి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్‌లో యూట్యూబ్ యాప్ ఉంటుంది, ఆ యాప్‌ను ప్రతి ఒక్కరు వినియోగిస్తారు అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. విదేశాల్లో ఇతర కొన్ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి, కానీ ఇండియాలో మాత్రం వీడియో అంటే యూట్యూబ్... యూట్యూబ్ అంటే వీడియో అనే స్థాయిలో ఆధరణ దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటివి వచ్చినా యూట్యూబ్ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. మెల్లమెల్లగా జనాలు వాటికి ఎక్కువ అలవాటు పడుతున్న నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఒరిజినల్స్ రాబోతున్నాయి.
యూట్యూబ్ ప్రీమియం మెంబర్స్...
ఇప్పటికే ఫ్రీ నుంచి ప్రీమియం వైపుకు ప్రేక్షకులు వచ్చేలా యూట్యూబ్ అడుగులు వేస్తోంది. తక్కువ రేటు నుంచి మొదలు పెట్టి తమ సబ్‌స్క్రైబర్స్ సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. ఇండియాలో ఇప్పటికే లక్షలాది మంది యూట్యూబ్ పెయిడ్ ప్రీమియం మెంబర్స్‌గా చేరారు అంటూ గూగుల్ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొంది. యూట్యూబ్ ఇండియా మరింత ముందుకు వెళ్లే ఉద్దేశంతో ఒరిజినల్ కంటెంట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఇతర ఓటీటీలు ఎలా అయితే తమ ఒరిజినల్ కంటెంట్‌ను, వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాయో అలాగే ఇకపై యూట్యూబ్ సైతం తమ ఒరిజినల్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. అందుకోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో యూట్యూబ్ ఇండియా ఉందని తెలుస్తోంది.
బాలీవుడ్ ప్రేక్షకులు సీరియల్స్ కోసం...
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలీఫిల్మ్స్ తో యూట్యూబ్ ఇండియా ప్రతినిధులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. హిందీలో సీరియల్స్ పేరు చెప్పగానే బాలాజీ టెలీఫిల్మ్స్ గుర్తుకు వస్తుంది. ఆ స్థాయిలో ఈ నిర్మాణ సంస్థలో ఏక్తా కపూర్ సీరియల్స్ ను అందించింది. సినిమాల కంటే ఒకానొక సమయంలో సీరియల్స్ కి ప్రేక్షకులు ప్రేమికులు అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సీరియల్స్‌ను నిర్మించిన బాలాజీ టెలీఫిల్మ్స్ ఏక్తా కపూర్ ఇప్పుడు యూట్యూబ్ కోసం సీరియల్స్ ను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సీరియల్స్ ను యూట్యూబ్ కోసం నిర్మించాలని ఏక్తా కపూర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి సీరియల్‌ను మొదటగా 200 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చే ఆధరణ అనుసారం వాటి సంఖ్య పెంచబోతున్నారు.
యూట్యూబ్ ఇండియాలో హిందీ సీరియల్స్...
ఈమద్య కాలంలో శాటిలైట్ ఛానల్స్ కేవలం సీరియల్స్ కోసం అన్నట్లుగా పరిస్థితి మారింది. వాటిని కూడా కొందరు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా సీరియల్స్ అది కూడా టీవీలో లేకుండా నేరుగా రావడం అంటే కచ్చితంగా కొత్త ఒరవడి అనడంలో సందేహం లేదు. యూట్యూబ్ ఒరిజినల్ సీరియల్స్ సక్సెస్ అయితే ప్రముఖ నిర్మాణ సంస్థలు సీరియల్స్ నిర్మాణంకు క్యూ కట్టే అవకాశం ఉంది. అందుకే శాటిలైట్ ఛానల్స్ కనిపించకుండా పోయే అవకాశం ఉందని, అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఓటీటీలకు సైతం ఇదో పెద్ద షాక్ అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో యూట్యూబ్ కి ఉన్న ఆధరణ నేపథ్యంలో కేవలం హిందీలోనే కాకుండా అన్ని భాషల్లోనూ కచ్చితంగా యూట్యూబ్ సీరియల్స్ వచ్చే అవకాశం ఉంది. 2030 వరకు మొత్తం వినోద రంగం మారబోతుంది అనే అభిప్రాయం ను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.