ది ప్యారడైజ్‌.. మరో షాక్ ఇస్తారా?

నాని సినిమా అంటే ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించే క్యారెక్టర్స్ ఎక్కువగా గుర్తొచ్చేవి. జెర్సీ, నిన్ను కోరి, గ్యాంగ్ లీడర్ నుంచి హాయ్ నాన్న వరకు ఆయన బలం కూడా అదే. కానీ గత మూడు నాలుగేళ్లలో ఆ స్క్రీన్ ఇమేజ్ నెమ్మదిగా మారింది.

Update: 2026-09-14 05:49 GMT

నాని సినిమా అంటే ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించే క్యారెక్టర్స్ ఎక్కువగా గుర్తొచ్చేవి. జెర్సీ, నిన్ను కోరి, గ్యాంగ్ లీడర్ నుంచి హాయ్ నాన్న వరకు ఆయన బలం కూడా అదే. కానీ గత మూడు నాలుగేళ్లలో ఆ స్క్రీన్ ఇమేజ్ నెమ్మదిగా మారింది. దసరాలో రఫ్ లుక్‌తో మొదలైన మార్పు ఇప్పుడు ది ప్యారడైజ్ దగ్గరకు వచ్చేసరికి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, భారీ యాక్షన్ వరకు వెళ్లింది.

దసరాలో శ్రీకాంత్ ఓదెల నానిని పూర్తిగా మరో టోన్ లో హైలెట్ చేశాడు. గడ్డం, మాసిన బట్టలు, తెలంగాణ యాసతో ధరణి క్యారెక్టర్ నాని అప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా కనిపించింది. ఆ సినిమాలో యాక్షన్ ఉన్నా, క్యారెక్టర్ లుక్‌నే ఎక్కువగా మార్చారు. తర్వాత సరిపోదా శనివారంలో మాస్ యాక్షన్ పెరిగింది. హిట్ 3లో అర్జున్ సర్కార్‌గా వైలెన్స్ కూడా నాని సినిమాల్లో అప్పటివరకు చూడని స్థాయికి వెళ్లింది.

ఇప్పుడు ది ప్యారడైజ్‌లో శ్రీకాంత్ ఓదెల మరో లెవెల్లో ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. జడలు, గడ్డం, మస్క్యులర్ బాడీతో ఇప్పటికే బయటకు వచ్చిన నాని జడల్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమా తన కెరీర్‌లో ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎక్కువగా అలసిపోయేలా చేసిన ప్రాజెక్ట్ అని నాని కూడా చెప్పారు. షూటింగ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో నెలల పాటు అదే ఫిజిక్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు సినిమాలోని ఒక ఫైట్ సీన్ గురించి మరో టాక్ బయటకు వచ్చింది. ఆ సీక్వెన్స్‌లో నాని ఒంటిపై దుస్తులు లేకుండా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై టీమ్ నుంచి అధికారిక సమాచారం లేదు. సినిమా విడుదలయ్యే వరకు అసలు సీన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ నాని గత సినిమాలు చూస్తే బాడీని చూపించడానికే స్పెషల్ సీన్లు చేయడం అతని స్టైల్ కాదు. అందుకే నిజంగా అలాంటి సీన్ ఉంటే అది క్యారెక్టర్ లేదా సందర్భంతోనే రావచ్చు.

ది ప్యారడైజ్ కూడా రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ కథలా కనిపించడం లేదు. 1980ల సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో జడల్ అనే పాత్రలో నాని కనిపిస్తున్నారు. తల్లి కొడుకు ఎమోషన్‌తో పాటు ఒక వర్గానికి సంబంధించిన కథ కూడా ఉంటుందని శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే చెప్పారు. దసరాలో ఊరి ప్రపంచాన్ని తీసుకున్న దర్శకుడు, ఈసారి స్లమ్ బ్యాక్‌డ్రాప్‌ను మరింత పెద్ద స్కేల్‌లో తీసుకొచ్చారు. సెప్టెంబర్ 24న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ట్రైలర్ కూడా విడుదల చేయకుండా డైరెక్ట్ సినిమాతోనే పూర్తి కథను చూపించాలని టీమ్ నిర్ణయించింది. మరి ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News