హైప్ ఎందుకు తగ్గిస్తున్నారు?
‘ది ప్యారడైజ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు నాని కెరీర్‌లోనే పెద్ద పాన్ ఇండియా సినిమా ఇదే అన్న టాక్ వచ్చింది.
‘ది ప్యారడైజ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు నాని కెరీర్‌లోనే పెద్ద పాన్ ఇండియా సినిమా ఇదే అన్న టాక్ వచ్చింది. ‘ఆయా షేర్’ పాట తర్వాత ఆ హైప్ ఇంకాస్త పెరిగింది. జడల్ లుక్, శ్రీకాంత్ ఓదెల మేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ కలిపి సినిమాపై అంచనాలు మరో లెవెల్ కి వెళ్లాయి. కానీ రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ టీమ్ మాట్లాడుతున్న తీరు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ట్రైలర్ లేకుండానే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నాని చెప్పిన దాని ప్రకారం ట్రైలర్ కోసం నాలుగు రోజుల సమయం పెట్టాల్సి వస్తుంది. ఆ టైమ్‌ను సినిమాను పూర్తి చేయడానికి ఉపయోగించాలని టీమ్ నిర్ణయించింది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తీసుకున్న నిర్ణయం కాదని కూడా ఆయన చెప్పారు. ఇక్కడి నుంచే సోషల్ మీడియాలో కొత్త టాక్ మొదలైంది.
ప్రెస్‌మీట్‌లో కూడా నాని మాటలు గతంలో కొన్ని సినిమాల రిలీజ్ ముందు కనిపించినంత అగ్రెసివ్‌గా లేవనే కామెంట్స్ వచ్చాయి. సినిమా చాలా కష్టపడి చేశామని, ఇది తల్లి కొడుకు కథ అని చెప్పారు. అదే సమయంలో ‘పాన్ ఇండియా’ అనే ట్యాగ్‌ను కూడా పక్కన పెట్టి, తెలుగు ప్రేక్షకులే తమ మొదటి టార్గెట్ అని అన్నారు. అంచనాలను ఇంకా పెంచే మాటల కంటే సినిమా గురించి సింపుల్‌గా చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
మరోవైపు నిర్మాత సుధాకర్ చెరుకూరి మాత్రం ప్రాజెక్ట్‌పై గట్టిగానే మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ ఓదెల కూడా సినిమా విషయంలో ఎక్కడా తగ్గలేదని టీమ్ చెబుతోంది. అయినా రిలీజ్‌కు రెండు వారాల ముందు వరకు షూటింగ్ పనులు కొనసాగడం, ట్రైలర్ లేకపోవడం లాంటి విషయాలు బయట సందేహాలకు చోటిచ్చాయి. సెప్టెంబర్ 24 రిలీజ్ డేట్ మారుతుందనే ప్రచారం కూడా కొద్ది రోజుల క్రితం వరకు నడిచింది.
అయితే మేకర్స్ కావాలనే హైప్‌ను కంట్రోల్ చేస్తున్నారనే మరో వాదన కూడా ఉంది. పోస్టర్లు, పాటలు చూసి ఇది పూర్తిగా భారీ యాక్షన్ సినిమా అనుకుని వచ్చే ప్రేక్షకుడికి లోపల తల్లి కొడుకు ఎమోషన్ ఎక్కువగా ఉంటే అంచనాలు తేడా పడొచ్చు. అందుకే ఇప్పుడు కథ అసలు టోన్ ఏంటో ముందే చెప్పి ఆడియన్స్‌ను ప్రిపేర్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక ట్రైలర్ లేకపోవడంతో రాబోయే రోజుల్లో చేసే ప్రమోషన్స్ మరింత కీలకంగా మారనున్నాయి. సినిమా రన్‌టైమ్ 2 గంటల 49 నిమిషాలు. కొత్త లుక్, యాక్షన్, డ్యాన్స్, వాయిస్ వరకు జడల్ కోసం నాని చాలా మార్చుకున్నారు. సెప్టెంబర్ 24కు ముందు వచ్చే ఇంటర్వ్యూలు, పాటలు, ఈవెంట్స్‌లో టీమ్ సినిమాను ఏ విధంగా ప్రమోట్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.