నాని.. ప్రతిసారీ ఊరించడమేనా?

కానీ చాలా సినిమాల విషయంలో చివరికి చూస్తే పాన్ ఇండియా రిలీజ్ కేవలం పోస్టర్లకే పరిమితం అవుతూ ఉంటుంది.

Update: 2026-09-15 12:55 GMT

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతార లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించి అందులో నటించిన హీరోలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ తెచ్చిపెట్టాక.. తామూ అలా పాన్ ఇండియా స్థాయిలో మెరిసిపోవాలని చాలామంది హీరోలు ఆశపడ్డారు. అందుకు తగ్గ కథల వేటలో పడ్డారు. సినిమా మొదలవుతున్నపుడే బహు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం మామూలే.

కానీ చాలా సినిమాల విషయంలో చివరికి చూస్తే పాన్ ఇండియా రిలీజ్ కేవలం పోస్టర్లకే పరిమితం అవుతూ ఉంటుంది. ఎంతో ప్రయాసపడి కొన్ని సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినా.. ఏమాత్రం ప్రభావం చూపవు. కొన్ని సినిమాలకు ఇతర భాషల్లో అసలు రిలీజే ఉండదు. ఇలా చాలామంది హీరోల విషయంలో జరిగింది. నేచురల్ స్టార్ నాని కూడా ఆ జాబితాలోనే ఉంటాడు.

తన సినిమాల్లో దసరా, సరిపోదా శనివారం లాంటి వాటికి పాన్ ఇండియా రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇతర భాషల రిలీజ్ గురించి ఘనంగా చెప్పుకున్నారు. తీరా చూస్తే ఆ సినిమాలకు ఇతర భాషల్లో రిలీజ్ సరిగానే ప్లాన్ చేయలేదు. నామమాత్రంగా విడుదలయ్యాయి. రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ప్రమోషన్ అస్సలు లేకపోయింది. వాటికి ఇతర భాషల్లో ప్రభావం చూపే సత్తా ఉన్నా సరే.. ప్లానింగ్ లోపం వల్ల ఫెయిలయ్యాయి. ‘హాయ్ నాన్న’కు కూడా పాన్ ఇండియా రిలీజ్ అని చెప్పినా.. ఎక్కువ హడావుడి అయితే జరగలేదు. రిలీజ్ టైంకి ఇతర భాషల విడుదల గురించి అస్సలు పట్టించుకోలేదు.

ఇప్పుడిక వర్తమానంలోకి వస్తే.. ‘ది ప్యారడైజ్’ను మొదలుపెట్టినపుడే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అన్నారు. విదేశీ భాషలతో కలిపి 8 లాంగ్వేజెస్‌లో రిలీజ్ అన్నారు. తీరా చూస్తే.. ఈ సినిమా ఇండియాలో ఇతర భాషల్లోనూ సరైన రిలీజ్‌కు నోచుకోవట్లేదు. ఈ సినిమా ప్రోమోలు నార్త్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాయి. ఆయా షేర్ పాట కూడా అక్కడ ఫేమస్ అయింది. అక్కడ సినిమాకు బాగానే హైప్ వచ్చింది. పైగా ‘కిల్’ ఫేమ్ రాఘవ్ జుయల్ ఇందులో విలన్ పాత్ర చేశాడు. సినిమాను నార్త్‌లో సరిగ్గా ప్రమోట్ చేస్తే, రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగా ఉంటే.. పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపే అవకాశముండేది.

కానీ ఆ చిత్ర బృందమే హిందీ రిలీజ్ మీద పెద్దగా ఫోకస్ లేనట్లు కనిపిస్తోంది. మొన్న ప్రెస్ మీట్లో నాని కూడా ‘పాన్ ఇండియా’ అనే మాట వద్దు.. ఇతర భాషల్లో రిలీజవుతున్నప్పటికీ బేసిగ్గా ఇది తెలుగు సినిమా అంటూ ‘ది ప్యారడైజ్’ పరిధిని తగ్గించేశాడు. మరి కంటెంట్ మీద నమ్మకం లేదా.. లేక టైం తక్కువుండడం వల్ల పాన్ ఇండియా ప్రమోషన్లు, రిలీజ్ ప్లానింగ్‌కు వీలులేకపోతోందా అన్నది తెలియడం లేదు. కానీ నాని మాత్రం పాన్ ఇండియా స్థాయికి తన మార్కెట్‌ను విస్తరించే మంచి ఛాన్స్ మిస్సయ్యాడనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News