జీరో నుంచి 100 కోట్ల క్ల‌బ్ రేంజుకు నేచురల్‌స్టార్

తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషితో `నేచురల్ స్టార్`గా ఎదిగిన హీరో నాని ప్రయాణం నిజంగా స్పూర్తిదాయకం.

Update: 2026-08-30 07:45 GMT

తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషితో `నేచురల్ స్టార్`గా ఎదిగిన హీరో నాని ప్రయాణం నిజంగా స్పూర్తిదాయకం. సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి 2008లో `అష్టాచెమ్మా` చిత్రంతో నటుడిగా పరిచయమైనప్పుడు అత‌డు ఒక సాధారణ హీరో మాత్రమే. తొలి సినిమా `అష్టాచెమ్మా`ను అత్యంత పరిమిత బడ్జెట్‌తో నిర్మిస్తే..అది బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 6 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను సాధించి సంచలన విజయం నమోదు చేసింది. ఆ సమయంలో నాని అందుకున్న పారితోషికం చాలా తక్కువే అయినా ఆ సినిమా ఇచ్చిన విజయం చిత్రసీమలో స్థిరపడేలా చేసింది.

అక్కడి నుంచి నాని అడుగులు ఇంతింతై వటుడింతై అన్న చందంగా ముందుకు సాగాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల జాబితాను పరిశీలిస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `ఈగ` (రూ. 125+ కోట్లు), శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన `దసరా`(రూ. 130+ కోట్లు), `సరిపోదా శనివారం` (రూ. 100+ కోట్లు), `ఎంసిఎ - మిడిల్ క్లాస్ అబ్బాయి`(రూ. 70+ కోట్లు), `భలే భలే మగడివోయ్` (రూ. 55+ కోట్లు) ప్రధానంగా నిలుస్తాయి.

ఇటీవలి కాలంలో నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నాయి. `దసరా` చిత్రం రూ. 130 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించి నాని కెరీర్‌లోనే మొదటి రూ. 100 కోట్ల క్లబ్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఫీల్ గుడ్ డ్రామా `హాయ్ నాన్న` ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్లకు పైగా వసూలు చేయగా.. గతేడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ `సరిపోదా శనివారం` మరోసారి రూ. 100 కోట్ల మైలురాయిని దాటి బాక్సాఫీస్ వద్ద నాని స్టామిటాను నిరూపించింది.

ఈ విజయాలన్నింటినీ మించి ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ `ది ప్యారడైజ్` నాని మార్కెట్ రేంజ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. ఈ సినిమా కేవలం ఓవర్సీస్ హక్కుల రూపంలోనే ఏకంగా రూ. 22.5 కోట్ల మైండ్ బ్లాకింగ్ డీల్ కుదుర్చుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక తెలుగు హీరో సినిమాకు విడుదలకు ముందే ఈ స్థాయిలో రూ. 22.5 కోట్ల బిజినెస్ జరగడం నాని క్రేజ్ .. అక్కడ అత‌డికి ఉన్న బలమైన మార్కెట్‌కు నిదర్శనం.

ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కథల ఎంపికతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్న నాని.. ఇప్పుడు స్థిరంగా రూ. 100 కోట్ల క్లబ్ హీరోగా రూపాంతరం చెందారు. ఓవర్సీస్‌లో సాధించిన ఈ రికార్డ్ బ్రేకింగ్ రూ. 22.5 కోట్ల డీల్ అత‌డి గ్లోబల్ రీచ్‌ను స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో రానున్న‌ ప్రాజెక్టులతో నాని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలన రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News