దసరా తర్వాత హాయ్ నాన్న.. మరి ప్యారడైజ్ తర్వాత?
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో దసరా ఒక మాస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆ సినిమాలో ఊరమాస్ అవతార్ లో కనిపించిన నాని.. వెంటనే హాయ్ నాన్నతో పూర్తిగా మరో యాంగిల్ ను చూపించారు.
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో దసరా ఒక మాస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఆ సినిమాలో ఊరమాస్ అవతార్ లో కనిపించిన నాని.. వెంటనే హాయ్ నాన్నతో పూర్తిగా మరో యాంగిల్ ను చూపించారు. మాస్ సినిమా తర్వాత క్లాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చిన నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ది ప్యారడైజ్ తర్వాత కూడా అలాంటి మూవీ వస్తుందా? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది.
కొన్నేళ్ల క్రితం వరకు నాని అంటే ఎక్కువగా పక్కంటి కుర్రాడి ఇమేజ్ గుర్తొచ్చేది. సాధారణ కుర్రాడి పాత్రలు, లవ్ స్టోరీలు, కామెడీ ఎంటర్టైనర్లు చేస్తూ యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఒకే లాంటి పాత్రలకు పరిమితం కావడం నానికి ఇష్టం లేదు. అందుకే తన సినిమాల స్టైల్ ను మార్చుకుంటూ వచ్చారు. ఎంసీఏతో మాస్ టచ్ మొదలుపెట్టి.. దసరాతో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత సరిపోదా శనివారం, హిట్: ది థర్డ్ కేస్ వంటి సినిమాలతో యాక్షన్, వయొలెన్స్ ఉన్న పాత్రల్లో కూడా కనిపించారు. దసరా తర్వాత వచ్చిన హాయ్ నాన్న మాత్రం పూర్తిగా భిన్నమైన సినిమా. తండ్రీకూతుళ్ల రిలేషన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఆ సినిమా నాని పాత ఇమేజ్ ను మరోసారి గుర్తు చేసింది. అంటే ఒకవైపు మాస్ సినిమాతో అభిమానులను అలరిస్తూనే.. మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను మెప్పిస్తూ నాని బ్యాలెన్స్ చేశారు.
కానీ ఇప్పుడు ది ప్యారడైజ్ తర్వాత పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నాని ఇంతకుముందెన్నడూ కనిపించని రా అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించారు. 1980ల సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఆ సినిమాలో ఆయన రోల్ కంప్లీట్ మాస్, యాక్షన్ వైపు సాగింది. జడల్ జమానాగా తనదైన మాస్ తో ఆకట్టుకున్నారు.
అయితే ఇదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ విషయంలో దసరా తర్వాత హాయ్ నాన్న వచ్చినట్లు.. ది ప్యారడైజ్ తర్వాత నాని నుంచి మళ్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందా అనే ప్రశ్న మొదలవుతోంది. దీంతో ప్రస్తుతం ప్యారడైజ్ తర్వాత నాని చేయబోయే సినిమాలపై ఆసక్తి పెరిగింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బ్లడీ రోమియో స్టైలిష్ యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రచారంలో ఉంది.
దీంతో పాటు వెంకీ అట్లూరి, సీబీ చక్రవర్తి దర్శకత్వంలో కూడా ప్రాజెక్టులు చర్చలో ఉన్నాయి. అయితే వీటిలో ఏ సినిమా ముందుగా వస్తుంది? నాని మళ్లీ ఫ్యామిలీ స్టోరీ తో వస్తారా? లేక వరుసగా యాక్షన్, మాస్ సినిమాలనే కంటిన్యూ చేస్తారా? అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారింది. మరి దసరా తర్వాత హాయ్ నాన్నతో బ్యాలెన్స్ చేసిన నాని.. ప్యారడైజ్ తర్వాత ఎలాంటి సినిమాతో ఆ లోటును భర్తీ చేస్తారో లేదో వేచి చూడాలి.