ప్యార‌డైజ్ రూమ‌ర్ల‌కు తెర‌

తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తూనే.. క్వాలిటీ విష‌యంలో కాంప్రమైజ్ కానిది అంటే నానినే.

Update: 2026-05-13 03:55 GMT

తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తూనే.. క్వాలిటీ విష‌యంలో కాంప్రమైజ్ కానిది అంటే నానినే. గ‌త కొన్నేళ్ల‌లో మిడ్ రేంజ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగిన నాని.. ఏటా క‌నీసం ఒక్క రిలీజ్ అయినా ఉండేలా చూసుకుంటాడు. సినిమాకు సినిమాకు మ‌ధ్య పెద్ద‌గా గ్యాప్ ఉండ‌దు. కానీ గ‌త ఏడాది హిట్-3తో ప‌ల‌క‌రించాక ఏడాదికి పైగానే నాని కెరీర్లో గ్యాప్ వ‌చ్చింది. ఈ ఏడాది మార్చి రిలీజ్ టార్గెట్‌తో నాని మొద‌లుపెట్టిన ది ప్యార‌డైజ్.. త‌న గ‌త చిత్రాల్లాగా టార్గెట్‌ను అందుకోలేక‌పోయింది. మార్చి చివ‌రి వారం నుంచి ఆగ‌స్టు 21కి ఈ చిత్రం వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. కానీ ఆ డేట్‌కు కూడా సినిమా రాద‌ని.. షూటింగ్ మ‌రింత ఆల‌స్యం అవుతోంద‌ని.. అస‌లు ఈ ఏడాది చివ‌రికి కూడా ది ప్యార‌డైజ్ రిలీజ్ కాక‌పోతే ఆశ్చ‌ర్యం లేద‌ని ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాక ఈ సినిమాకు రీషూట్లు కూడా జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

చాలా రోజులుగా ఈ రూమ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ మౌనంగా ఉండిపోయిన టీం.. ఎట్ట‌కేల‌కు స్పందించింది. ఈ ప్ర‌చారాల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని టీం సోష‌ల్ మీడియాలో అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ది ప్యార‌డైజ్‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా వంద‌కు పైగా వ‌ర్కింగ్ డేస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిగిన‌ట్లు టీం ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించడం విశేషం. ఐతే అందులో ఏ ఒక్క స‌న్నివేశానికీ రీ షూట్ జ‌ర‌గ‌లేద‌ని.. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చిత్రీక‌రిస్తున్నార‌ని.. సినిమా మీద ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన ప‌ని లేద‌ని టీం స్ప‌ష్టం చేసింది. అంతే కాక ఇక ముందు షూట్, మిగ‌తా కార్య‌క్ర‌మాలు కూడా ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రుగుతాయ‌ని.. ఆగ‌స్టు 21న ప‌క్కాగా ది ప్యార‌డైజ్ రిలీజ‌వుతుంద‌ని కూడా చిత్ర బృందం తేల్చి చెప్పింది. దీంతో నాని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ది ప్యార‌డైజ్ కోసం నాని.. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన బ్ల‌డీ రోమియోను వెన‌క్కి జ‌రిపాడు. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ది ప్యార‌డైజ్‌లో నాని స‌ర‌స‌న కాయ‌దు లోహ‌ర్ న‌టిస్తోంది. మోహ‌న్ బాబు విల‌న్ పాత్ర చేస్తున్నారు.

Tags:    

Similar News