ఆ రూ.2500 చెక్ బౌన్స్ : నాని
హిట్ 3 సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సమయంలో విడుదల చేసిన వీడియోతో అంచనాలు ఆకాశానికి పెరిగిన విషయం తెల్సిందే.;
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్ 3' సినిమా విడుదలకు సిద్ధం అయింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 1, హిట్ 2 సినిమాలు సక్సెస్ అయిన నేపథ్యంలో హిట్ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి హిట్‌లో విశ్వక్ సేన్ నటించగా, రెండో హిట్‌లో అడవి శేష్ నటించారు. ఆ రెండు సినిమాలను మించి, కంటెంట్ విషయంలో నెవ్వర్ బిఫోర్ అనే విధంగా హిట్ 3 ఉంటుందనే నమ్మకంను దర్శకుడు శైలేష్ కొలను ఇటీవల ఒక సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అందుకే ఈ సినిమాపై అంచనాలు మరింత ఉన్నాయి.
హిట్ 3 సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సమయంలో విడుదల చేసిన వీడియోతో అంచనాలు ఆకాశానికి పెరిగిన విషయం తెల్సిందే. హిట్ ప్రాంచైజీలో మరిన్ని సినిమాలు వచ్చే విధంగా, ప్రతి ప్రాంచైజీ సినిమాపై అంచనాలు పెంచే విధంగా హిట్ 3 ఉంటుంది అంటూ మేకర్స్ బలంగా చెబుతున్నారు. నాని ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గానే కాకుండా, ఇప్పటి వరకు కనిపించని వైవిధ్యభరిత పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ అయ్యాయని, హింస మరీ ఎక్కువ ఉందని స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. హిట్ 3 పై చాలా నమ్మకంతో ఉన్న నాని ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాని మాట్లాడుతూ... హిట్ 3 లో విశ్వక్ సేన్, అడవి శేష్ ఉన్నారా? లేరా? అనే విషయాలను చెప్పలేను. కానీ సినిమాలో చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్‌కి షాక్ అవుతారు. హిట్ 3 అందరికీ నచ్చే విధంగా ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను నమ్మి.. నా బ్యానర్‌లో సినిమాను చేసేందుకు ఒప్పుకోవడం గొప్ప విషయం. ఆయన ప్రశంసలు నాకు ప్రపంచంలోనే అతి పెద్ద అవార్డ్. ఆయన సినీ కెరీర్ 75 శాతం పూర్తి అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. అలాంటి గొప్ప నటుడు నన్ను నమ్మడంను ఎప్పటికీ మరచిపోలేను అన్నాడు. యాంకర్ సుమతో జరిపిన చిట్ చాట్‌లో నాని ఇంకా పలు విషయాలను చెప్పుకొచ్చాడు.
అష్టా చమ్మా సినిమాతోనే నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. అంతకు ముందు నుంచే నేను ఏడు ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ కష్టం చాలా ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో వచ్చిన మొదటి శాలరీ రూ.4000 లు. అంతకు ముందు ఒక సినిమాకు వర్క్ చేసినందుకు గాను రూ.2500 చెక్ ఇచ్చారు. ఆ చెక్‌ను బ్యాంక్‌లో వేసిన సమయంలో బౌన్స్ అయింది. నా మొదటి పారితోషికంకు సంబంధించిన ఆ బౌన్స్ చెక్ ఇప్పటికీ నా వద్ద ఉంది. ఆ చెక్ ద్వారా డబ్బులు రాకున్నా నాకు అదో గుర్తుగా ఉందని నాని సరదాగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో తాను అందుకున్న మొదటి శాలరీ రూ.4000 లు కాగా, నిర్మాతగా తాను ఇచ్చిన మొదటి చెక్ ఎంత అంటే మాత్రం నాని గుర్తు లేదని సమాధానం దాటవేశాడు.
హిట్ 3 తర్వాత నాని 'ది ప్యారడైజ్' సినిమాతో ప్రనేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా గురించి ప్రశ్నించిన సమయంలో నాని స్పందిస్తూ... అది చాలా డిఫరెంట్ సినిమా. ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదని కచ్చితంగా చెప్పగలను అన్నాడు. ఈ రెండు సినిమాలతో నాని ఇండస్ట్రీలో పది మెట్లు పైకి ఎక్కుతాడని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.