లైఫ్‌ని చూసే విధానం మార్చేసింది.. కార్ ప్రమాదంపై నాని!
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద అద్భుత ఓపెనింగులు సాధించింది. వారం పాటు నాని హవాకు ఎదురే లేదన్న టాక్ వినిపిస్తోంది.;
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద అద్భుత ఓపెనింగులు సాధించింది. వారం పాటు నాని హవాకు ఎదురే లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగానే తాజా పాడ్ కాస్ట్ లో నాని చెప్పిన ఓ సంగతి అభిమానులను ఆలోచింపజేసింది. అది నిజంగా భయానక ఘటన. ఆరోజు రాత్రి నాని టెర్రిబుల్ కార్ యాక్సిడెంట్ అనంతరం ఏం జరిగిందో మాట్లాడారు.
నేను నా సొంత కార్ కొనుక్కోవడానికి ముందు స్నేహితుడి కార్ లో హైవే జర్నీ చేసాం. ముగ్గురు స్నేహితులం కలిసి వెళుతున్నాం. హైవే మార్గం గుండా వెళుతూ, అనూహ్యంగా టర్న్ తిప్పాను. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. రాత్రి పూట చాలా చీకటిగా ఉంది. కానీ ఇంతలోనే మేం వెళ్లి దేనినో గుద్దాము. నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. అద్దం పెంకులు నాకు గుచ్చుకున్నట్టు గుర్తుంది. వేగంగా రక్తం కారుతోంది. బలవంతంగా డోర్ ని తోయాలని ప్రయత్నించాను.. కానీ అది చేయలేకపోయాను. చివరికి బయటకు వచ్చి, కార్ లోంచి నా స్నేహితులను బయటకు లాగాను.. అని నాని చెప్పాడు. ఈ ఘటనలో భయపడిన ముందు సీట్లోని స్నేహితుడు పెద్దగా కేకలు పెట్టి భయపెట్టాడని కూడా నాని వెల్లడించాడు.
కార్ యాక్సిడెంట్ అయ్యింది అనగానే అక్కడికి ఆంబులెన్స్ వచ్చింది. దానిలో అందరం ఆస్పత్రికి బయల్దేరాం. కానీ మేం వెళుతున్నప్పుడు దారిలో ఓ పెళ్లి వ్యాన్ యాక్సిడెంట్ కి గురై కనిపించింది. అక్కడ అందరూ ముస్తాబై జబర్ధస్త్ గా ఉన్నారు. కానీ రక్తమోడుతూ కనిపించారు. మాతో పాటు ఆస్పత్రికి వస్తామని అభ్యర్థించారు. మేం మాతో పాటు గాయపడిన వారిని తీసుకుని వెళ్లాం. కానీ అందులో ఒక చిన్నారి ప్రమాదానికి గురి కావడం నన్ను వెంటాడింది. ఆ రాత్రి ఐసీయులో చేర్చించిన తర్వాత కూడా నేను అక్కడే తన కోసం ఎదురు చూశాను. రాత్రంతా అక్కడే ఉండి తన యోగక్షేమాల గురించి తెలుసుకున్నాను. ఆ రాత్రి జీవితం విషయంలో నా ధృక్పథం మారిపోయింది. నేను జీవితాన్ని ఎలా చూస్తాను? నొప్పిని ఎలా చూస్తానో అంతా మారిపోయింది. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా జీవించాలని నిర్ణయించుకున్నాను.. అని నాని తెలిపాడు.