2011 నుంచి నంది అవార్డులు.. ఇండస్ట్రీ ఫీలింగ్ ఇదీ!
ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా ఆగిపోయిన ప్రతిష్టాత్మక `నంది అవార్డుల` పునరుద్ధరణకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా ఆగిపోయిన ప్రతిష్టాత్మక `నంది అవార్డుల` పునరుద్ధరణకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. 2011 నుంచి నిలిచిపోయిన నంది అవార్డులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సీఎం- డిప్యూటీ సీఎం- బాలకృష్ణ కృషితో ఈ పురస్కారాలకు మళ్లీ పునరుజ్జీవనం వచ్చింది. 2012 నుంచి 2016 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు ఆ తర్వాతి సంవత్సరాలకు కూడా అవార్డులను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. భరత్ భూషణ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏటా నాలుగు అవార్డుల చొప్పున (రెండు ప్రొడక్షన్, రెండు స్పెషల్ జ్యూరీ) అందజేయనున్నారు. అలాగే 2025 సంవత్సరానికి కూడా ఫిల్మ్ అండ్ టీవీ నంది అవార్డులు ఇవ్వనున్నారు.
ఈ భారీ ప్రకటన వెనుక ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని (టైమ్‌లైన్) కూడా ప్రకటించింది. అక్టోబర్‌లో అవార్డుల ఎంపిక కమిటీలను ఏర్పాటు చేసి.. నవంబర్‌లో సెలక్షన్ ప్రక్రియ పూర్తి చేసి.. 2026 డిసెంబర్‌లో అవార్డు ప్రదానోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నంది ఫిల్మ్ అవార్డులను అమరావతి లేదా విజయవాడలో టీవీ అవార్డులను తిరుపతిలో నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో మొత్తం 46 ఫిల్మ్ అవార్డులు అందించనుండగా.. విజేతలకు బంగారం, వెండి, కాంస్య, రాగి పతకాలతో పాటు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేయనున్నారు. అలాగే ఎనిమిది ప్రత్యేక విభాగాల్లో గోల్డ్ మెడల్స్ కూడా ఇవ్వనున్నారు. టెలివిజన్ విభాగంలో 48 అవార్డులతో పాటు ఎన్టీఆర్, బి.ఎన్. రెడ్డి, రఘుపతి వెంకయ్య వంటి జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డులను కూడా నగదు బహుమతులతో ప్రదానం చేయనున్నారు. కేవలం సినిమా, టీవీలే కాకుండా నాటక రంగానికి కూడా పూర్వవైభవం తెచ్చేలా `నంది నాటక అవార్డులు` తిరిగి ప్రారంభిస్తూ 2027 జనవరిలో తెనాలిలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో (ముఖ్యంగా ఎక్స్ వేదికగా) భిన్నమైన స్పందనలతో పాటు తీవ్ర చర్చలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు, సినీ అభిమానులు ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తుండగా.. మరికొందరు దీనిపై అసంతృప్తి ని వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. గత 15 ఏళ్లలో వివిధ ప్రభుత్వాల హయాంలో రాజకీయ పరిస్థితులు, కరోనా వంటి కారణాల వల్ల అవార్డులు ఆగిపోయాయని.. ఇన్నాళ్లకు ఒక స్పష్టమైన షెడ్యూల్ రావడం సంతోషకరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ పరిశ్రమ ఇంకా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉందని.. కేవలం అవార్డులు ప్రకటించడం కంటే ఏపీలో స్టూడియోలు, షూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ చర్చలో భాగంగా సోషల్ మీడియాలో మరికొన్ని ఆసక్తికరమైన కోణాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ జరుపుకునే సినిమాలకే లేదా స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ అవార్డులు ఇవ్వాలని.. లేదంటే ఇవి కేవలం హైదరాబాద్ కేంద్రంగా ఉండే వారికి మాత్రమే పరిమితమవుతాయని నెటిజనులు సూచిస్తున్నారు. సినిమా టికెట్ల పెంపులు ఇస్తూ ఇలాంటి అవార్డుల ప్రకటనలు చేయడంపై కొన్ని సెటైర్లు కూడా పేలాయి. నంది అవార్డుల పునరుద్ధరణ ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి, కళాకారులకు మళ్లీ గొప్ప ప్రోత్సాహం లభిస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం దీన్ని అమలు చేయడం సవాల్‌తో కూడుకున్న విషయమని పేర్కొంటున్నారు.
మొత్తానికి ఏళ్ల తరబడి అనిశ్చితిలో ఉన్న నంది అవార్డులకు ప్రభుత్వం ఒక స్పష్టమైన రూపం తీసుకురావడం హర్షణీయమే అయినా కానీ దీన్ని విజయవంతంగా అమలు చేయడం ముఖ్యం. ఏడేళ్ల పెండింగ్ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేస్తూ పారదర్శకంగా అవార్డుల ప్రక్రియను పూర్తి చేయడం ద్వారానే ఈ పురస్కార వైభవాన్ని, దాని ప్రాముఖ్యతను మళ్లీ నిలబెట్టగలరు. ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలు తెలుగు సినిమా- టెలివిజన్ - నాటక రంగాలకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తాయనేది మునుముందు రోజుల్లో తేలనుంది.