నాగార్జున మాట గుర్తుందా?

ఈ మధ్యే ఒక సినిమా ఈవెంట్లో అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాల మేకింగ్ తీరు మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-09-09 08:19 GMT

ఈ మధ్యే ఒక సినిమా ఈవెంట్లో అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం సినిమాల మేకింగ్ తీరు మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా విడుదల తేదీకి నెల రోజుల ముందే ఫిలిం మేకర్స్ ఫస్ట్ కాపీ తీసేవాళ్లని.. ‘అన్నమయ్య’ సహా చాలా సినిమాలకు ఇలా జరిగిందని.. షూటింగ్ త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌కు టైం ఇవ్వకపోతే ఔట్ పుట్ దెబ్బ తింటుందని.. ఈ హడావుడి మంచిది కాదని ఆయన హితవు పలికారు.

తమ ప్రొడక్షన్లో వచ్చే సినిమాలకు కూడా ఇలాంటి హడావుడి తప్పట్లేదని.. కాబట్టి తమతో పాటు అందరూ మారాలని ఆయన కోరారు. నాగ్ ఒక్కడే కాదు.. చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ విపరీతంగా ఆలస్యం కావడం.. పోస్ట్ ప్రొడక్షన్ హడావుడి కావడం మీద నిర్మాతలు ఎంత మొత్తుకుంటున్నా దర్శకుల తీరు మారట్లేదని ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది.

ఇప్పుడు మేకింగ్ దశలో ఉన్న చాలా సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. సినిమాల మేకింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ అన్నది చాలా ముఖ్యమైన దశ. సినిమా రష్‌కు మెరుగులు దిద్దడానికి, బెస్ట్ ఔట్ పుట్ తీసుకురావడానికి ఈ దశలో టైం పెట్టడం చాలా అవసరం. కానీ ఇప్పుడు మేకింగ్‌ దశలో ఉన్న ఏ పెద్ద సినిమాకు కూడా నెల రోజు ముందు కూడా రష్ అందుబాటులోకి రావడం లేదు. నెలల్లో పూర్తి చేయాల్సిన షూటింగ్‌ను ఏళ్లకు ఏళ్లు చేస్తున్నారు. ముందు అనుకున్న వర్కింగ్ డేస్ కంటే చాలా ఎక్కువ రోజులు షూట్ చేస్తున్నారు. పర్ఫెక్షన్ అని, రీషూట్లు అని అదనపు వర్కింగ్ డేస్‌తో సినిమాను విపరీతంగా ఆలస్యం చేస్తున్నారు.

తీరా కొంచెం ప్రశాంతంగా చేయాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ పనిని మాత్రం హడావుడిగా లాగించేస్తున్నారు. రిలీజ్‌కు కొన్ని వారాల సమయం ఉండగా.. ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంటోంది. మరోవైపు డబ్బింగ్, ఎడిటింగ్, మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు రేయింబవళ్లు హడావుడిగా చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో రావాల్సిన ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. దీని తర్వాత రాబోయే సినిమాల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే అవుతోంది. నాగ్ అన్నట్లుగా కాస్త ముందు పోస్ట్ ప్రొడక్షన్ టీం చేతిలో సినిమాను పెట్టే రోజులు ఎప్పటికి వస్తాయా అని నిర్మాతలు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి మార్పు ఎప్పుడొస్తుందో?

Tags:    

Similar News