నాగార్జున ఫోటోలతో టీషర్టులు.. కోర్టులో ఏం జరిగిందంటే?
ముఖ్యంగా చట్టబద్ధమైన హక్కులు లేకుండా ఒక స్టార్ హీరో ఫొటోలు కమర్షియల్ గా ఎలా ఉపయోగిస్తారని ధర్మాసనం ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కు సంబంధించిన కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడుతూ టీషర్టులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణలో నాయస్థానం చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా చట్టబద్ధమైన హక్కులు లేకుండా ఒక స్టార్ హీరో ఫొటోలు కమర్షియల్ గా ఎలా ఉపయోగిస్తారని ధర్మాసనం ప్రశ్నించడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం జరిపిన విచారణలో.. సంబంధిత వ్యాపార సంస్థ తరఫు న్యాయవాది ఆసక్తికర వాదనలు వినిపించారు. ది ఘోస్ట్ సినిమాకు తాము అఫీషియల్ మెర్చండైజింగ్ పార్టనర్స్ అని, ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా సినిమా నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరిందని తెలిపారు. అంతేకాకుండా నాగార్జున ఆ ప్రొడక్టులు ప్రమోట్ చేశారని కూడా వాదించారు. అయితే కోర్టు అడిగిన కీలక ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు.
విచారణలో అత్యంత కీలకంగా మారింది అగ్రిమెంట్ అంశమే. నాగార్జునతో గానీ, సినిమా నిర్మాణ సంస్థతో గానీ తమకు నేరుగా ఎలాంటి ఒప్పందం లేదని వ్యాపార సంస్థ తరఫు న్యాయవాది అంగీకరించారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. డైరెక్ట్ అగ్రిమెంట్ లేకపోతే, నాగార్జున పేరు, ఫోటోలు కమర్షియల్ పరంగా ఉపయోగించే హక్కు ఎలా వచ్చిందంటూ నిలదీసింది. కోర్టు ప్రశ్నలతో ఆ సంస్థ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్లు కనిపించింది.
ఈ సందర్భంగా నాగార్జున తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలను గట్టిగా వినిపించారు. పర్మిషన్ లేకుండా ఒక సినీ హీరో పర్సనాలిటీ వ్యాపార ప్రయోజనాలకు యూజ్ చేయడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత ఒప్పంద పత్రాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా.. పూర్తి వివరాలు అందించలేదని పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన ఈమెయిల్స్, స్క్రీన్ షాట్లు కూడా ఇన్ కంప్లీట్ గా ఉన్నాయని వివరించారు.
దీంతో ఆ సంస్థ మరోసారి అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. పూర్తి ఈమెయిల్స్, ఒప్పంద పత్రాలు, సంబంధిత ఆధారాలను ఒక వారంలో సమర్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ 2026 ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఇక కేసులో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గతేడాది సెప్టెంబర్ లోనే నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఆయన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలు లేదా ప్రొడక్ట్స్ సేల్స్ లో వినియోగించరాదని అప్పుడే స్పష్టం చేసింది.
అయినప్పటికీ ఇప్పుడు మరోసారి అదే అంశంపై వివాదం తలెత్తడం గమనార్హం. సినీ ప్రముఖుల పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని వాణిజ్యపరంగా వినియోగించే విషయంలో క్లియర్ పర్మిషన్, చట్టబద్ధ ఒప్పందాలు ఎంత ముఖ్యమో ఆ కేసు మరోసారి గుర్తు చేస్తోంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్, మెర్చండైజింగ్ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ కు మరింత ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పాలి.