తరం మారినా.. నాగ్ ప్రయోగాలు మారలేదు!
తెలుగు చిత్రసీమలోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలో కూడా నాగార్జున ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.;
తెలుగు చిత్రసీమలోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలో కూడా నాగార్జున ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఆయన నటించిన పాన్ ఇండియా బిలింగ్వల్ చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క భాషకు పరిమితం కాకుండా మూడు భాషల్లోనూ ప్రేక్షకులను మెప్పించిన నాగ్.. గడిచిన మూడు తరాల తారలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక స్టార్.
నాగార్జున కెరీర్‌ను విశ్లేషిస్తే, ఆయన ప్రయాణం అన్నపూర్ణ స్టూడియో నుంచి మాత్రమే కాదు.. అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ స్టార్‌డమ్ నుంచి మొదలైంది. తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కృష్ణ గారి లాంటి తెలుగు సీనియర్ స్టార్లతో ఆయన సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్లతోనూ స్క్రీన్ పంచుకున్నారు.
ఇదే కాదు.. రజనీకాంత్, మోహన్ బాబు, హరికృష్ణ వంటి మొన్నటి తరం నటులతోనూ కలిసి పనిచేశారు. ఇక నాని లాంటి లేటెస్ట్ ట్రెండ్ హీరోతో దేవదాస్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా నాగార్జున ‘కుబేర’ సినిమాలో ధనుష్, రష్మిక మందన్న లాంటి నూతన తారలతో కలిసి నటించడం, సినిమా విడుదలై మంచి హిట్ కావడం చర్చనీయాంశమైంది. ఇందులో ఆయన పోషించిన సీబీఐ ఆఫీసర్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా రెండు కోణాల్లో చూపిన ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అయ్యిందని అందరూ చెబుతున్నారు. దీపక్ అనే పాత్రలో పోషించిన వ్యత్యాసభరిత నటన ఆయన కెరీర్‌లో మరో మెట్టు అని చెప్పొచ్చు. నాగార్జున స్పెషాలిటీ ఏంటంటే.. ఏ తరంలో అయినా.. ఎలాంటి భాషలో అయినా.. ఆడియెన్స్ టేస్ట్ ను పట్టుకోవడం అలవాటుగా మారింది. ‘మన్మథుడు’ లాంటి రొమాంటిక్ సినిమాలు చేసినా.. బంగార్రాజు లాంటి మాస్ క్యారెక్టర్ చేసినా ఇట్టే మెల్ట్ అయిపోతారు.
ఇక ఇప్పుడు డీ గ్లామర్ రోల్ లో సీరియస్ గాను మెప్పించడం గమనార్హం. తాను నటించిన తారల తరం మారినా, ఆయనను చూస్తున్న ప్రేక్షకుల తరం మారినా.. ఆయన మీద ఉన్న క్రేజ్ మాత్రం మారలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో తండ్రి తరం నుంచి తన కొడుకు తరం తారల దాకా ప్రతి ఒక్కరితో స్క్రీన్ పంచుకున్న ఏకైక స్టార్ నాగార్జున అనే చెప్పాలి. ఈ తరతరాల వారసత్వాన్ని కెరీర్ లో ప్రతిబింబించిన ఆయన నేటికీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. భాష, తరం అనే బారియర్లను దాటి ముందుకు సాగుతున్న నాగార్జున.. నిజంగా ఇండియన్ సినిమాకు ఓ విలువైన కింగ్.