అఖిల్ 'లెనిన్'.. అక్కడ కమీషన్ తో సహా రాబట్టేసిందా?
కానీ ఆ సినిమా వల్ల నిజంగా లాభపడిందా లేదా అనే విషయం మాత్రం డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో కనిపిస్తుందని మూవీ ఎక్స్పర్ట్స్ తరచూ చెబుతుంటారు.
ఒక సినిమా హిట్ అయితే హీరో, దర్శకుడు, నిర్మాతల ఆనందం అందరికీ కనిపిస్తుంది. కానీ ఆ సినిమా వల్ల నిజంగా లాభపడిందా లేదా అనే విషయం మాత్రం డిస్ట్రిబ్యూటర్ల ముఖాల్లో కనిపిస్తుందని మూవీ ఎక్స్పర్ట్స్ తరచూ చెబుతుంటారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా విషయంలో కూడా అదే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గుంటూరులో జరిగిన సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అఖిల్ హీరోగా, మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున నిర్మించారు. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం, లెనిన్ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకుని సూపర్ హిట్ జాబితాలో చేరింది.
ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరులో నిర్వహించిన సక్సెస్ మీట్ లో నాగవంశీ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. వేదికపై గుంటూరు డిస్ట్రిబ్యూటర్లను చూపిస్తూ ఆయన సరదాగా మాట్లాడారు. "నేను మీ జిల్లా వచ్చి మీ జిల్లా డిస్ట్రిబ్యూటర్లను అందరి ముందు చూపించకపోతే ఎలా? మొన్న ఏడుపు మొహం వేసుకుని తిరుగుతున్నారని అన్నా కదా. వాళ్లను ధైర్యంగా పిలవడానికి కారణం ఉంది. కమీషన్ తో సహా బ్రేక్ ఈవెన్ పూర్తిచేశారు. అందుకే వాళ్లను నవ్వు ముఖాలతో చూపిస్తున్నా" అంటూ చెప్పొకొచ్చారు.
అంతేకాకుండా, ఇటీవల కొన్ని సినిమాల సక్సెస్ మీట్‌ల సమయంలో బ్రేక్ ఈవెన్ కాలేదని, పెట్టుబడులు తిరిగి రాలేదని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని నాగవంశీ పేర్కొన్నారు. అందుకే ఈసారి డిస్ట్రిబ్యూటర్లే సంతోషంగా ఉన్నారని, వారి ముఖాల్లోని ఆనందమే లెనిన్ విజయానికి నిదర్శనమని చెప్పారు. సాధారణంగా ఒక సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే పెట్టుబడి తిరిగి రావడమే.
కానీ నాగవంశీ ప్రత్యేకంగా కమీషన్ తో సహా బ్రేక్ ఈవెన్ అని చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు కేవలం నష్టాల నుంచి బయటపడటమే కాకుండా, తమకు రావాల్సిన కమీషన్, మార్జిన్ కూడా పొందినట్లు ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే అఖిల్ కెరీర్ లో లెనిన్ కీలక చిత్రంగా మారిన సమయంలో వచ్చిన ఆ విజయం అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
చాలా కాలం తర్వాత అఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషంగా మారింది. ఏదేమైనా లెనిన్ కేవలం ప్రేక్షకుల ప్రశంసలు మాత్రమే కాకుండా, బిజినెస్ పరంగా కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ సాధిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా గుంటూరు మార్కెట్ లో డిస్ట్రిబ్యూటర్లు కమీషన్‌తో సహా పెట్టుబడులు రాబట్టుకున్నారన్న మాట ఇప్పుడు సినిమా విజయానికి మరో సాలిడ్ సర్టిఫికెట్ గా మారింది.