మురుగదాస్ వ్యాఖ్యలపై డ్యామేజ్ కంట్రోల్

ఈ నేపథ్యంలోనే మురుగదాస్ ‘మదరాసి’ తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ కోసం హైదరాబాద్ రాలేదు. పైగా శివకార్తికేయన్ ఈ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు.. మురుగదాస్‌ కామెంట్లకు భిన్నంగా కనిపించాయి.;

Update: 2025-09-02 00:30 GMT

తమిళ సీనియర్ దర్శకుడు మురుగదాస్‌కు ఒకప్పుడు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒకప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఠాగూర్’ ఒరిజినల్ ‘రమణ’ తీసింది అతనే. ఆ తర్వాత ‘గజిని’ డబ్బింగ్ వెర్షన్ తెలుగులో ఇరగాడేసి మురుగదాస్‌కు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. తర్వాత ‘తుపాకి’ సైతం ఇక్కడ బాగా ఆడింది.

మరోవైపు తెలుగులో స్టాలిన్, స్పైడర్ చిత్రాలూ తీశారు. ఈ సినిమాలు అనుకున్నంతగా ఆడకపోయినా మురుగదాస్ మీద మన వాళ్లలో సానుకూల భావనే ఉండేది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన మీద తెలుగు వాళ్లలో ఆగ్రహం తెప్పించాయి. తెలుగు దర్శకుల సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టవచ్చు కానీ.. తమిళ దర్శకుల చిత్రాలు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తాయంటూ ఆయన చేసిన కామెంట్ వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కూడా జరిగింది.

ఈ నేపథ్యంలోనే మురుగదాస్ ‘మదరాసి’ తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ కోసం హైదరాబాద్ రాలేదు. పైగా శివకార్తికేయన్ ఈ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు.. మురుగదాస్‌ కామెంట్లకు భిన్నంగా కనిపించాయి. కంటెంట్ కోసం తెలుగులో ఎంతైనా ఖర్చు పెడతారని.. అందుకే ఇక్కడ వెయ్యి కోట్ల సినిమాలు వస్తున్నాయని కితాబు ఇచ్చాడు. ఓవైపు మురుగదాస్ ఈ ఈవెంట్‌కు రాకపోవడం, మరోవైపు ఆయన కామెంట్లను ఖండిస్తున్నట్లుగా శివకార్తికేయన్ మాట్లాడ్డం చర్చనీయాంశంగా మారింది.

మురుగదాాస్ ఇంటర్వ్యూ వల్ల తెలుగులో బాగానే డ్యామేజ్ జరిగిందని టీం అర్థం చేసుకున్నట్లుంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే మురుగదాస్ ఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నట్లున్నారు. ఇక్కడికి వస్తే మీడియా వాళ్లు కచ్చితంగా ఆ కామెంట్ల గురించి అడిగి రచ్చ జరగడం ఖాయం. మరోవైపు మురుగదాస్ కామెంట్లకు భిన్నంగా శివకార్తికేయన్ మాట్లాడడంతో బ్యాలెన్స్ జరిగి ఆ గొడవను మరిచిపోయి సినిమాను సానుకూల దృక్పథంతో చూస్తారని భావిస్తున్నారు.

Tags:    

Similar News