కరణ్ జోహార్ కూడా అవి కష్టం అనేశాడు..!
సౌత్ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువ వస్తూ ఉండేవి. మొన్నటి వరకు కూడా బాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి.;
సౌత్ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువ వస్తూ ఉండేవి. మొన్నటి వరకు కూడా బాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ హిట్ కాగా, కొన్ని నిరాశ పరిచాయి. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోలు గెస్ట్‌లుగా నటించిన సందర్భాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల కాంబోలో కూడా సినిమాలు ఉన్నాయి. వీరి కాంబోలోనే కాకుండా చాలా సినిమాల్లో పెద్ద హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ హీరోల మధ్య ఉన్న సఖ్యతకు అది నిదర్శణం అంటూ ఉండేవారు. చిరంజీవి-బాలకృష్ణ వంటి స్టార్స్ కలిసి నటించరు, కానీ బాలీవుడ్‌లో కామన్‌గా మల్టీస్టారర్‌లు వస్తాయి అనే అభిప్రాయం ఉండేది.
హిందీ సినిమా ఇండస్ట్రీలో కూడా మల్టీ స్టారర్ సినిమాలు అనేవి తగ్గి పోతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల మల్టీ స్టారర్‌లు కనిపించడం లేదు. ఇటీవల వచ్చిన హౌస్‌ఫుల్ ప్రాంచైజీ మూవీని మల్టీ స్టారర్ మూవీగా ప్రమోట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్‌లు నటించడం ద్వారా చాలా మంది ఈ సినిమాను మల్టీస్టారర్‌గా ఒప్పుకోవడం లేదు. గతంలో లవ్ సినిమాలకు, ఫీల్ గుడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ముందు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరణ్ జోహార్ నుంచి సినిమాలు ఎక్కువగా రావడం లేదు, వచ్చినా నిరాశ పరుస్తున్నాయి.
కరణ్ జోహార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయడం చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అంత ఈజీగా మల్టీ స్టారర్ సినిమాలు చేయలేక పోతున్నాం. చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాల పట్ల ఆసక్తి కనబర్చడం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు వచ్చే మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకులను సంతృప్తి పరచడం కష్టంగా మారిందని, హీరోల యొక్క అభిమానుల మధ్య గొడవలు ఉంటున్న కారణంగా మా అభిమాన హీరో గొప్ప అంటే మా అభిమాన హీరో గొప్ప అన్నట్లుగా మాట్లాడుకుంటూ సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నాయి. ఆ కారణాల వల్ల కూడా మల్టీస్టారర్‌లు తగ్గుతూ ఉండవచ్చు అన్నట్లుగా కరణ్ జోహార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో కరణ్ జోహార్ బ్యానర్ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్నారు, ఇప్పుడు స్టార్స్‌గా వెలుగుతున్నారు. కానీ కరణ్ జోహార్ ఈ మధ్య కాలంలో తన స్టార్‌డంను కాపాడుకోవడం కోసమే కష్టపడుతున్నాడు. దర్శకత్వం ను పెద్దగా పట్టించుకోవడం లేదు, అలాగే నిర్మాణం విషయంలోనూ గతంలో మాదిరిగా జోష్ కనిపించడం లేదు. కరణ్ జోహార్ వంటి ప్రముఖ నిర్మాత, అందరు హీరోలతో సన్నిహితంగా ఉండే నిర్మాతనే మల్టీస్టారర్ సినిమాలు ఇకపై రావడం సాధ్యం కాదు అన్నాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు ముందు అయినా పరిస్థితులు మారి మల్టీస్టారర్ సినిమాలు వస్తాయా అనేది చూడాలి.