MSG అమెరికాలో 2 రోజుల ముందే మిలియన్ డాలర్ క్లబ్
తాజా సమాచారం మేరకు.. సినిమా విడుదల కావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే (జనవరి 12న విడుదల) అమెరికా మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ 1 మిలియన్ డాలర్ల (9కోట్లు) మార్కును దాటేశాయి.;
అమెరికాలో ఒక మిలియన్ డాలర్ క్లబ్ సాధించడం అంటే అది పెద్ద అఛీవ్‌మెంట్. ఇప్పుడు ఆ ఘనతను మరోసారి సాధించారు మెగాస్టార్ చిరంజీవి. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న `మన శంకరవరప్రసాద్ గారు` (MSG) చిత్రం అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను మొదలుపెట్టింది.
తాజా సమాచారం మేరకు.. సినిమా విడుదల కావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే (జనవరి 12న విడుదల) అమెరికా మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ 1 మిలియన్ డాలర్ల (9కోట్లు) మార్కును దాటేశాయి. మెగాస్టార్ కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. సంక్రాంతి సీజన్ కావడం, చిరంజీవితో పాటు వెంకటేష్ ఈ సినిమాలో సుదీర్ఘ నిడివి ఉన్న పాత్రలో కనిపించనుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.
ఇప్పటికే ట్రైలర్ గొప్ప ఆదరణను దక్కించుకుంది. చిరంజీవి కామెడీ టైమింగ్, ఆయన వింటేజ్ డ్యాన్స్ స్టెప్పులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాగా, విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఉండటం వల్ల మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీస్ ఈ చిత్రంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎఫ్ 2, ఎఫ్ 3 తరహాలో ఆరోగ్యకరమైన వినోదం అభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
జనవరి 12న ఎంఎస్.జి విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇటు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, అమెరికాలోను ఎంఎస్ జి గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఇప్పటికే భారీ ఓపెనింగ్స్ సాధించిన `రాజా సాబ్` సినిమాతో చిరంజీవి సినిమా పోటీ పడుతోంది. తమిళ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న జననాయగన్ నుంచి కూడా చిరు సినిమాకి పోటీ ఎదురవనుంది.
అయితే తెలుగు రాష్ట్రాల తర్వాత చిరంజీవికి బలమైన మార్కెట్ ఉన్న యూఎస్‌లో `మన శంకరవరప్రసాద్ గారు` తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అక్కడ రెండు రోజుల ముందే 9కోట్ల (1మిలియన్ డాలర్) వసూళ్లతో అదరగొట్టేసింది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేష్, నయనతార, చిత్రంగద సింగ్ (గెస్ట్ రోల్) తదితరులు నటించారు.