పిక్‌టాక్ : సూపర్‌ స్టార్‌ షర్ట్‌పై మెగాస్టార్ పిక్స్‌

మలయాళ సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోలుగా కొనసాగుతూ వస్తున్న మోహన్‌ లాల్‌, మమ్ముట్టీ మధ్య చిన్న పాటి గొడవలు, అసూయ ద్వేషాలు కూడా ఉండవు.;

Update: 2025-09-08 10:30 GMT

టాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్‌ హీరోలు పైకి బాగానే ఉన్నట్లుగా అనిపిస్తారు, కానీ కోల్డ్‌ వార్‌ నడుస్తూ ఉంటుందని, ఒకరి విషయంలో ఒకరు అసూయను కలిగి ఉంటారు అని, ఒకరిపై మరొకరి డామినేషన్‌కి ప్రయత్నిస్తూ ఉంటారు అని ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు కూడా సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు మాత్రం చాలా స్నేహంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అయితే ఇతర భాషల ఇండస్ట్రీలోని హీరోల మధ్య సంబంధాలతో పోల్చితే మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌, మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీల మధ్య ఉన్న స్నేహం చాలా గొప్పది, చాలా బలమైనది, ఆదర్శణీయమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మమ్ముట్టీ ఆరోగ్యం కోసం మోహన్‌ లాల్‌

మలయాళ సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోలుగా కొనసాగుతూ వస్తున్న మోహన్‌ లాల్‌, మమ్ముట్టీ మధ్య చిన్న పాటి గొడవలు, అసూయ ద్వేషాలు కూడా ఉండవు. ఎన్నో సందర్బాల్లో వీళ్లు కలవడం మనం చూస్తూ ఉంటాం. కలిసి మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా కలిసి సినిమాల్లో నటించిన దాఖలాలు కూడా ఉన్నాయి. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ మధ్య వీరి కాంబోలో మూవీ రాలేదు. త్వరలో మళ్లీ వీరి కాంబోలో ఒక సినిమా రాబోతుందని, ఇండియస్ బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ మూవీగా ఆ సినిమా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఆ మధ్య మమ్ముట్టీ ఆరోగ్యం బాగాలేని సమయంలో మోహన్‌ లాల్‌ శబరిమల యాత్ర చేసి స్నేహితుడి ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరి స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే.

బిగ్‌బాస్ షో లో మోహన్‌ లాల్‌ ఔట్‌ ఫిట్‌

సాధారణంగా ఏదైనా కార్యక్రమంలో ఒక స్టార్‌ మరో స్టార్‌ పేరును ప్రస్థావించేందుకు కూడా కాస్త ఇబ్బంది పడుతాడు, అవసరమా అన్నట్లుగా పేరును స్కిప్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది పాపులర్‌ బిగ్‌ బాస్‌ షో లో మోహన్‌ లాల్‌ ఏకంగా తన స్నేహంకు గుర్తుగా మమ్ముట్టీ ఫోటోలు ఉన్న షర్ట్‌ను ధరించడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మలయాళ బిగ్‌బాస్‌ కి మోహన్‌ లాల్‌ హోస్ట్‌ అనే విషయం తెల్సిందే. మోహన్‌ లాల్‌ ఏ డ్రెస్ వేసినా ప్రతి వారం చర్చనీయాంశం అవుతుంది. మోహన్‌ లాల్‌ ఔట్‌ ఫిట్‌ గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి మమ్ముట్టీ ఫోటోలు ఉన్న షర్ట్‌ ను ధరించడం ద్వారా మరింతగా వార్తల్లో నిలిచిన మోహన్‌ లాల్‌ బిగ్‌ బాస్‌ను సైతం వార్తల్లో నిలిపాడు.

మమ్ముట్టీ 74వ పుట్టిన రోజు సందర్భంగా

మమ్ముట్టీ 74వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుక జరుపుకున్నారు. కానీ ఎప్పటిలాగే మెగాస్టార్ మమ్ముట్టీ సైలెంట్‌గానే, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. స్నేహితుడి బర్త్‌డే సందర్భంగా మోహన్‌ లాల్‌ ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు ఉన్న షర్ట్‌ను ధరించాడు. చాలా విభిన్నంగా ఉన్న ఈ షర్ట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్పెషల్‌ షర్ట్‌ను మోహన్‌ లాల్‌ ధరించడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. మోహన్‌ లాల్‌ ఒక సూపర్‌ స్టార్‌, అలాంటి స్టార్‌ మరో స్టార్‌ నటుడి ఫోటో ఉన్న షర్ట్‌ ను ధరించడం అనేది చాలా గొప్ప విషయం. తన స్టార్‌డంను పక్కన పెట్టి, స్నేహితుడికి ఇలా విభిన్నంగా బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పడంను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఇందుకే మోహన్‌ లాల్‌ సూపర్‌ స్టార్‌ అయ్యారు అంటూ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News