సూపర్‌ స్టార్‌ సినిమాకు రీ సెన్సార్‌.. ఏం మారిందంటే!

సెన్సార్‌ బోర్డ్‌ మరోసారి సినిమాకు సెన్సార్‌ చేసింది. ఈసారి ఏకంగా 25 మార్పులను, చేర్పులను సూచించిందని సమాచారం అందుతోంది.;

Update: 2025-04-01 12:11 GMT

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ తాజాగా 'ఎల్‌ 2 : ఎంపురాన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయ్యి వారం కావస్తుంది. విడుదలైనప్పటి నుంచి సినిమా చుట్టూ వివాదం రాజుకుంది. ముఖ్యంగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఒక జాతీయ పార్టీకి చెందిన నాయకులు, మతతత్వ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. హిందువుల వ్యతిరేకి అంటూ సుకుమారన్‌పై కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎల్‌ 2 సినిమాను వెంటనే బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాత సినిమాను మరోసారి సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు తీసుకు వెళ్లాడు.

సెన్సార్‌ బోర్డ్‌ మరోసారి సినిమాకు సెన్సార్‌ చేసింది. ఈసారి ఏకంగా 25 మార్పులను, చేర్పులను సూచించిందని సమాచారం అందుతోంది. ముఖ్యంగా వివాదాస్పదం అయిన విలన్‌ పాత్ర పేరును మార్చడంతో పాటు, పలు మత పరమైన గుర్తులను, డైలాగ్స్‌ను తొలగించడం లేదా మ్యూట్‌ చేయడం జరిగిందట. అంతే కాకుండా కొన్ని సీన్స్‌ను బ్లర్ చేయడం, కొన్ని లోగోలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టడం చేయాలని సెన్సార్‌ బోర్డ్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. సినిమాను విడుదలై వారం రోజులు అయిన తర్వాత మరోసారి సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు తీసుకు వెళ్లి రీ సెన్సార్‌ చేయించడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎల్‌ 2 విషయంలో అది జరిగింది.

సినిమా టైటిల్ కార్డ్‌లో కేంద్ర మంత్రి సురేష్‌ గోపీకి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెల్సిందే. టైటిల్‌ కార్డ్‌లో సురేష్ గోపీ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విలన్‌ పేరును బజరంగి నుంచి బల్‌దేవ్‌గా మార్చారు. ఇంకా గుర్తించని మార్పులు చాలానే స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చేసిందని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ వివాదాలకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత చెప్పుకొచ్చాడు. రీ సెన్సార్‌ విషయమై ఎవరు డిమాండ్‌ చేయలేదు. సినిమా బ్యాన్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ చిత్ర యూనిట్‌ సభ్యులు మరో వారం పది రోజులు మౌనంగా ఉంటే వివాదం సర్ధుమనిగేది. కానీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌ రీ సెన్సార్‌కి వెళ్లాడు.

రీ సెన్సార్‌ పై నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌ మాట్లాడుతూ... సినిమా చుట్టూ నెలకొన్న వివాదం, భయంతో ఈ మార్పులు చేయలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌, పాత్రలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మాకు తెలిసింది. అందుకే బాధ్యతతో, స్వీయ నియంత్రణలో భాగంగా రీ సెన్సార్‌కి వెళ్లాం. అంతే కాకుండా సినిమాలోని పలు సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులను సైతం చేసినట్లు చెప్పుకొచ్చాడు. మలయాళంలో రూపొందిన ఈ సినిమా లూసీఫర్‌కి సీక్వెల్‌ అనే విషయం తెల్సిందే. ఎల్‌ 2 సినిమా మొదటి రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా రూ.300 కోట్ల నుంచి రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని మలయాళ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. రీ సెన్సార్‌ తర్వాత మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News