రజనీని కాదని విశాల్‌తో కరెక్టేనా సుందరా?
అయితే రజనీ ప్రాజెక్ట్ ఆగిపోయిన వెంటనే, తన ఫేవరెట్ హీరో అయిన విశాల్‌తో సుందర్ సి ఈ కొత్త సినిమాను పట్టాలెక్కించారు.;
దర్శకుడు సుందర్ సి - హీరో విశాల్ కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొగుడు (పురుషన్ -తమిళం) అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇదే టైటిల్ తో గతంలో గోపిచంద్ కథానాయకుడిగా ఓ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాల్ కోసం సుందర్ సి లాంటి సీనియర్ దర్శకుడు ఒక విలక్షణమైన స్క్రిప్టును రెడీ చేసారని తెలుస్తోంది.
సుందర్ సి నుంచి సాధారణంగా హారర్ కామెడీ (అరణ్మనై సిరీస్)లు వస్తాయని అనుకుంటే, ఇప్పుడు అతడు ఒక పక్కా యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ని రూపొందిస్తున్నారు. విశాల్ ఇందులో భార్య మాటకు ఎదురు చెప్పని ఒక సాదాసీదా భర్తగా కనిపిస్తారు. కానీ భార్యకు తెలియకుండా ఆయనలో ఒక భయంకరమైన యాక్షన్ కోణం (హింసాత్మక ప్రవృత్తి) ఉంటుంది.
ఇందులో విశాల్ సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ సుందర్ సి దర్శకత్వంలో గతంలో `యాక్షన్` అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం అంతగా విజయం సాధించలేదు. తమిళంలోను యావరేజ్ గా ఆడింది. అయితే ఇప్పుడు మరోసారి కాంబినేషన్ రిపీటవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది.
అన్నీ సవ్యంగా అనుకూలిస్తే....
నిజానికి సుందర్ సి అన్నీ సవ్యంగా జరిగితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాల్సింది. కానీ ప్రాజెక్టును ప్రకటించాక అనూహ్యంగా సుందర్ సి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని స్వయంగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా అనౌన్స్ అయిన `తలైవర్ 173` కోసం సుందర్ సి చాలా వర్క్ చేసారు కానీ, అది ఎందుకనో ప్రారంభ దశలోనే వర్కవుట్ కాలేదు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఎగ్జిట్ అయ్యారు. ముఖ్యంగా స్క్రిప్ట్ మార్పుల విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.
అయితే రజనీ ప్రాజెక్ట్ ఆగిపోయిన వెంటనే, తన ఫేవరెట్ హీరో అయిన విశాల్‌తో సుందర్ సి ఈ కొత్త సినిమాను పట్టాలెక్కించారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైంది. విశాల్ -సుందర్ సి కాంబినేషన్‌లో వచ్చిన `మదగజరాజా` ఇటీవల 12 ఏళ్ల ఆలస్యం తర్వాత విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ అదే జోష్‌తో వీరిద్దరూ ఈ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. విశాల్ కొత్త సినిమా మొగుడు టైటిల్ టీజర్ రిలీజై ఆకట్టుకుంది. పాత పాయింటునే కొత్తగా చూపించాలని నిర్ణయించుకున్న సుందర్ సి, ఈసారి విశాల్ పాత్రను ప్రయోగాత్మకంగా చూపించనున్నారని అర్థమవుతోంది.