అల్లు వారింట్లో ఏపీ CM చంద్రబాబు బిగ్ సర్‌ప్రైజ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లు వారి ఇంటికి చేరుకోగానే అల్లు అరవింద్, అల్లు కుటుంబ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు.;
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహం నైనికతో ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. అయితే తాజాగా ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి నేరుగా హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసానికి విచ్చేసి నూతన దంపతులను ప్రత్యేకంగా ఆశీర్వదించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లు వారి ఇంటికి చేరుకోగానే అల్లు అరవింద్, అల్లు కుటుంబ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు- భువనేశ్వరి దంపతులు అల్లు శిరీష్-నైనికలకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. సి.ఎన్.బి పర్యటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ పనుల ఒత్తిడిలోనూ సమయం కేటాయించి ఇంటికి రావడంపై అల్లు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ తన ఆత్మీయతను చాటుకుంటూ ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. చంద్రబాబు నాయుడుకు శాలువా కప్పి, జ్ఞాపికగా ఒక దేవుని విగ్రహ ప్రతిమను బహుకరించారు. అనంతరం అల్లు అరవింద్ సహా ఇతర కుటుంబ సభ్యులతో చంద్రబాబు కాసేపు పిచ్చాపాటీగా మాట్లాడారు. పాత జ్ఞాపకాలను, ప్రస్తుత పరిణామాలను చర్చించుకుంటూ ఈ సమావేశం అత్యంత సాన్నిహిత్యంగా సాగింది. అల్లు కుటుంబానికి.. నారా కుటుంబానికి ఉన్న సుదీర్ఘ అనుబంధం ఈ భేటీతో మరోసారి స్పష్టమైంది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దీవెనలు:
అల్లు శిరీష్ వివాహ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన పెళ్లి వేడుకకు హాజరవడమే కాకుండా.. చాలా సమయం అక్కడే గడిపి అల్లు కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. కేవలం పెళ్లికే పరిమితం కాకుండా ఇటీవల అల్లు సినిమాస్ (ఏఏఏ సినిమాస్) లాంచింగ్ వేడుకలోనూ రేవంత్ రెడ్డి పాల్గొని ఎక్కువ సమయం గడపడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నారా చంద్రబాబు రాకతో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అల్లు శిరీష్ వివాహానికి ప్రాధాన్యతనిచ్చారని అర్థమవుతోంది.
శిరీష్ పెళ్లికి కేవలం ముఖ్యమంత్రులే కాకుండా పలువురు కీలక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెళ్లి వేడుకలో నవదంపతులను ఆశీర్వదించారు. అలాగే తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి ప్రముఖులు కూడా విచ్చేసి నవదంపతులను ఆశీర్వదించారు. వీరితో పాటు ఉభయ రాష్ట్రాల నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.
మొత్తానికి అల్లు శిరీష్-నైనికల వివాహం అటు సినీ గ్లామర్‌తో పాటు ఇటు రాజకీయ హంగులతో ఒక చిరస్మరణీయ వేడుకగా నిలిచింది. ఒక వైపు రేవంత్ రెడ్డి స్వయంగా పెళ్లికి రావడం.. మరో వైపు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి మరీ నవదంపతులను ఆశీర్వదించడం అల్లు కుటుంబానికి రాజకీయ వర్గాల్లో ఉన్న పట్టును, గౌరవాన్ని చాటిచెబుతోంది. అల్లు వారింట స్పెషల్ సెలబ్రేషన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.