దోతీ కట్టిన మనవడు దేవాన్ష్.. తాతలు CBN-NBK ఆశీస్సులు
సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో నారా- నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. మనవడు దేవాన్ష్ పంచెకట్టులో మెరిసిపోతుంటే తాతలు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలు మురిపెంగా మనవడిని ఆశీర్వధించారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో వేడుకలు అంబరాన్నంటాయి. చంద్రబాబు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ - బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ (11) ధోతీ (పంచెకట్టు) వేడుక శనివారం (14 మార్చి 2026) హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత వైభవంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో నారా- నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. మనవడు దేవాన్ష్ పంచెకట్టులో మెరిసిపోతుంటే తాతలు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణలు మురిపెంగా మనవడిని ఆశీర్వధించారు.
దోతీ వేడుక అనేది తెలుగు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దీనిని సాధారణంగా బాలురకు 5 నుండి 12 ఏళ్ల వయస్సు మధ్య నిర్వహిస్తారు. ఇది బాల్యం నుండి కౌమార దశకు లేదా బాధ్యతాయుతమైన దశకు అడుగుపెడుతున్నట్లు సూచిస్తుంది. కేవలం దుస్తుల మార్పు మాత్రమే కాకుండా.. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం, క్రమశిక్షణను అలవర్చుకోవడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. దేవాన్ష్ సంప్రదాయబద్ధంగా పంచెకట్టు కట్టుకుని పెద్దలందరికీ నమస్కరించడం ఆ కుటుంబ సభ్యులలో గర్వాన్ని నింపింది.
ఈ వేడుక ఆద్యంతం రెండు కుటుంబాల కలయికతో ఎంతో ఉల్లాసంగా సాగింది. చంద్రబాబు నాయుడు - భువనేశ్వరి దంపతులు తమ మనవడిని ఆశీర్వధించి మురిసిపోయారు. మరోవైపు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ - వసుంధర దంపతులు కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేష్ నాయుడు - బ్రాహ్మణి దంపతులు అతిథులకు స్వాగతం పలుకుతూ వేడుకను పర్యవేక్షించారు. దేవాన్ష్ పెద్దవాడిగా ఎదుగుతూ మన సంప్రదాయాలను అందంగా ఆచరిస్తుండటం మా అందరికీ ఎంతో గర్వకారణం! అని లోకేష్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
నారా దేవాన్ష్ కేవలం రాజకీయ వారసుడు మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చదరంగం దిగ్గజం. ప్రస్తుతం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న దేవాన్ష్ చదరంగంలోను కొన్నేళ్లుగా అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడు. 2025లో లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌లో దేవాన్ష్‌ను `వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్` సత్కరించింది. చదరంగంలో అత్యంత వేగంగా 175 చెక్-మేట్ పజిల్స్ సాధించి వేగవంతమైన చెక్ మేట్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
చదరంగంపై దేవాన్ష్‌కు ఉన్న ఆసక్తి వెనుక కఠినమైన శిక్షణ ఉంది. తన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి (రాయ్ చెస్ అకాడమీ) పర్యవేక్షణలో రోజుకు ఐదారు గంటల పాటు సాధన చేస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. గతంలో దేవాన్ష్ 9 చెస్ బోర్డులపై ఉన్న మొత్తం 32 పావులను కేవలం ఐదు నిమిషాల్లోనే కచ్చితంగా అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే `టవర్ ఆఫ్ హనోయ్` పజిల్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేసిన రికార్డు కూడా దేవాన్ష్ సొంతం.
ప్రజా జీవితంలో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు, లోకేష్‌లు ఇలా బాలుడి కోసం ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించడం విశేషం. దేవాన్ష్ ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని రెండు కుటుంబాల పెద్దలు మనస్ఫూర్తిగా దీవించారు. రాజకీయాల కంటే మనవడి మురిపెమే తన ఉల్లాసం అన్నట్లుగా తాతగారు చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో పూర్తి ఉత్సాహంగా కనిపించారు. ఈ వేడుకలో కాబోయే హీరో నందమూరి మోక్షజ్ఞ కూడా స్పెషల్ లుక్ లో ప్రత్యక్షమయ్యారు.