ప్రేమ పెళ్లికి రెడీ అవుతోన్న అగ్ర నటుడి కుమార్తె!
బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి.
బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన ముద్దుల కుమార్తె దిశాని చక్రవర్తి చిరకాల స్నేహితుడు, ప్రియుడు మైల్స్ మంత్జారిస్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ..అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల ఆశీస్సులతో జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.దిశాని చక్రవర్తి జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నతనంలోనే మిథున్ చక్రవర్తి ఆమెను దత్తత తీసుకున్నారు.
ఒక చిన్నారిని చేరదీసి, సొంత పిల్లలతో సమానంగా, అమితమైన ప్రేమను అందించి పెంచారు మిథున్ దంపతులు. రక్తసంబంధం కంటే ప్రేమానుబంధమే గొప్పదని నిరూపిస్తూ దిశానిని గుండెల్లో పెట్టుకుని పెంచిన విధానం సినీ ఇండస్ట్రీలోనే అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. స్టార్ కిడ్‌గా పెరిగినప్పటికీ దిశాని చక్రవర్తి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి నిరంతరం ప్రయత్నించారు. కళలు, సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో అమెరికాలోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ -ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నత చదువులు చదివారు. తండ్రి పేరుతోనే కాకుండా తన స్వయంకృషితో పరిశ్రమలో రాణించాలనే పట్టుదల ఆమెలో కనిపిస్తుంది.
ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్, క్రియేటివ్ ప్రాజెక్టుల ద్వారా ప్రతిభను చాటుకున్నారు.ఇక దిశాని మనసు గెలుచుకున్న మైల్స్ మంత్జారిస్ విషయానికి వస్తే.. ఇద్దరి మధ్య చాలా కాలంగా స్నేహం, ప్రేమ బంధం ఉంది. విదేశాల్లో చదువుకునే రోజుల్లోనే ఇద్దరి పరిచయం కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. ఒకరి అభిరుచులు, ఆశయాలను మరొకరు గౌరవిస్తూ సాగిన సుదీర్ఘ ప్రయాణం వివాహ బంధం వైపు అడుగులు వేస్తోంది. తమ కుమార్తె ఎంపిక పట్ల మిథున్ చక్రవర్తి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న దిశాని, మైల్స్ దంపతులకు నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అర్పితా ఖాన్ ను అనే అనాధ బాలికను చిన్నప్పుడే దత్తత తీసుకుని పెంచి ప్రయోజకరాల్ని చేసిన సంగతి తెలిసిందే. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి కాకపోయినా? సల్మాన్ ఖాను అంతకంటే గొప్పగా అర్పితా ఖాన్ ను అన్నయ్యగా ప్రేమించాడు. చదువు..మంచి జీవితాన్ని ఇచ్చి పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేసిన సంగతి తెలిసిందే.