సూపర్‌స్టార్ కెరీర్‌లో మరో అతి పెద్ద రిస్కీ ఎటెంప్ట్!
నిజానికి రెస్క్యూ ఆపరేషన్ నేపథ్య సినిమాల్లో నటించడంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ ఇంకెవరికీ లేదు.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎల్లప్పుడూ వైవిధ్యమైన, ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన కెరీర్‌లో మరో అతి పెద్ద రిస్క్ చేయడానికి సిద్ధమయ్యారు. ఉత్తరాఖండ్‌లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిల్క్యారా టన్నెల్ (సురంగం) ప్రమాదం , 41 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన వాస్తవ సంఘటనల ఆధారంగా `సిల్క్యారా 41` అనే భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. గతంలో బాలీవుడ్‌లో ఇలాంటి రెస్క్యూ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలను మిగిల్చినా.. అమీర్ ఖాన్ ఇలాంటి పెద్ద సాహసానికి పూనుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
నిజానికి రెస్క్యూ ఆపరేషన్ నేపథ్య సినిమాల్లో నటించడంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ ఇంకెవరికీ లేదు. అక్షయ్ కుమార్ నటించిన నిజజీవిత రెస్క్యూ థ్రిల్లర్ `మిషన్ రాణిగంజ్` 2023 అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాణిగంజ్ కోల్‌ఫీల్డ్‌లో జరిగిన ఘోర ప్రమాదం, మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు మంచి సమీక్షలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఘోరంగా ఫెయిలైంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండే ఇలాంటి సబ్జెక్టులను జనాలు థియేటర్లలో చూడటానికి అంతగా ఆసక్తి చూపించరనే టాక్ ఉన్నా.. ఇప్పుడు అమీర్ ఖాన్ అదే జోనర్‌ను నమ్ముకుని ప్రయోగం చేస్తున్నారు.
అయితే బాక్సాఫీస్ పరంగా రిస్క్ అయినా నిజ జీవిత కథలలో నటించినప్పుడు అవి ప్రేక్షకులను చాలా ఇన్ స్పయిర్ చేస్తుంటాయి. స్ఫూర్తివంతంగా ఉంటాయి. ఈ నమ్మకంతోనే `సిల్క్యారా 41` చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక ఇండో-ఆస్ట్రేలియన్ కో-ప్రొడక్షన్‌గా అమీర్ ఖాన్ ప్లాన్ చేశారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడంలో భాగంగా ఇరు దేశాల సృజనాత్మక నైపుణ్యంతో రూపొందుతున్న ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రంలో 41 మంది కార్మికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ సాహసాన్ని, కార్మికుల అచంచలమైన ధైర్యాన్ని ప్రధానంగా వెండితెరపై చూపించబోతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక విజువల్ డ్రామాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ - ఆస్ట్రేలియాకు చెందిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. `బజరంగీ భాయిజాన్`, `83` వంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. `ది వాటర్ డివైనర్` ఫేమ్ ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ రచయిత ఆండ్రూ అనస్టాసియోస్ ఈ సినిమాకు పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అమీర్ ఖాన్, కబీర్ ఖాన్, శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, అరుణభ్ కుమార్... మితు భౌమిక్ లాంగేలు ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ స్పందిస్తూ.. సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ స్టోరీ తనను ఎంతగానో కదిలించిందని... ఇది అసాధ్యమైన పరిస్థితుల్లో మానవత్వం, ధైర్యం, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇరు దేశాల కలయికలో మానవ విజయగాథను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సినిమా రావడం గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రీమియర్ జసింతా అల్లాన్, ఆస్ట్రేలియా హోం వ్యవహారాల శాఖ మంత్రి టోనీ బర్క్‌లు కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ది గ్రేట్ అక్షయ్ కుమార్ సాధించలేకపోయిన రెస్క్యూ థ్రిల్లర్ విజయాన్ని.. తనదైన ఇన్వాల్వ్ మెంట్- మేకింగ్ శైలితో అమీర్ ఖాన్ అందుకోగలుగుతారా లేదా అనేది వేచి చూడాలి. ఎలాంటి నిజ జీవిత ఘటనను అయినా ఎమోషన్స్ తో రక్తి కట్టించేలా తెరకెక్కించడంలోనే దర్శకుడికి సవాల్ ఎదురవుతుంది. దానిని కబీర్ ఖాన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.