యానిమల్, దురంధర్ రేంజులో షాకిచ్చిన నోలాన్ 'ది ఒడిస్సీ' రన్‌టైమ్!
జూలై 9న `ది ఒడిస్సీ`కి సెన్సార్ బోర్డ్ అధికారికంగా సర్టిఫికెట్‌ను అందజేసింది. సెన్సార్ రికార్డుల ప్రకారం ఈ సినిమా మొత్తం నిడివి 172.33 నిమిషాలు.
చక్కని కథాబలం, బలమైన కథనం ఉంటే ఎంత సుదీర్ఘ నిడివి ఉన్నా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇప్పటికే చాలా చిత్రాలు నిరూపించాయి. బాలీవుడ్‌లో దాదాపు మూడున్నర (3.21ని.లు) గంటల నిడివితో వచ్చిన `యానిమల్`.. అలాగే మూడున్నర గంటల రన్‌టైమ్‌తో వచ్చిన యాక్షన్ డ్రామాలు `దురంధర్`, `దురంధర్ 2` సంచలన విజయాల్ని నమోదు చేసాయి. ఈ చిత్రాల తరహాలోనే ఇప్పుడు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ విజువల్ వండర్ `ది ఒడిస్సీ` కూడా అదే రేంజ్ భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ హిస్టారికల్ ఫిక్షన్ సినిమాని సుదీర్ఘ నిడివితో ప్రేక్షకులు థియేటర్లలో కళ్లప్పగించి చూడాల్సిందేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
జూలై 9న `ది ఒడిస్సీ`కి సెన్సార్ బోర్డ్ అధికారికంగా సర్టిఫికెట్‌ను అందజేసింది. సెన్సార్ రికార్డుల ప్రకారం ఈ సినిమా మొత్తం నిడివి 172.33 నిమిషాలు. అంటే `ది ఒడిస్సీ` చిత్రం కచ్చితంగా 2 గంటల 52 నిమిషాల 33 సెకన్ల నిడివితో సాగనుంది. మూడు గంటలకు కేవలం 7 ని.లు తక్కువ. అంతేకాకుండా ఈ సినిమాలో ఉన్న ఇంటెన్స్ కంటెంట్ కారణంగా కేవలం 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే చూసేందుకు వీలుగా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ `A` సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ భారీ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
గతంలో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం `ఓపెన్‌హైమర్` (2023) కేవలం ఒకే ఒక్క ఆడియో కట్‌తో భారతీయ సెన్సార్ బోర్డ్ నుండి యుఏ సర్టిఫికెట్ పొందింది. అయితే ఆ చిత్రంలోని ఒక లవ్‌మేకింగ్ సీన్‌ను మేకర్స్ స్వయంగా సెల్ఫ్-సెన్సార్ (కట్) చేసుకున్నారు. కానీ `ది ఒడిస్సీ` విషయంలో మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా అడల్ట్ సర్టిఫికెట్‌తోనే సినిమాను థియేటర్లలోకి దించుతున్నారు. దాదాపు మూడు గంటల నిడివి ఉన్నా.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నోలన్ ఈ సినిమాను అద్భుతమైన 3డి విజువల్ ట్రీట్‌గా ప్లాన్ చేశారనే టాక్ నడుస్తోంది.
ఈ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశాలు.. హృదయాలను కదిలించే ఎమోషన్స్.. ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లే కారణంగా సుదీర్ఘ నిడివి ఉన్నా కూడా.. ప్రేక్షకులు థియేటర్లలో కూర్చున్నప్పుడు ``అప్పుడే సినిమా అయిపోయిందా?`` అనే రేంజ్‌లో ఫీల్ అవుతారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని నోలాన్ మలిచారు. జూలై 17న విడుదల కాబోతున్న `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలనే ఉత్కంఠ అన్ని ఇండస్ట్రీలలో నెలకొంది.
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కథాబలం, బలమైన కథనం ఉంటే ఎంత సుదీర్ఘ నిడివి ఉన్నా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని గత దశాబ్ద కాలంలో (2016 - 2026 మధ్య) విడుదలైన పలు చిత్రాలు నిరూపించాయి. దాదాపు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ రన్‌టైమ్‌తో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన టాప్ మూవీస్ జాబితాలో మార్వెల్ `అవెంజర్స్: ఎండ్‌గేమ్` (3 గంటల 2 నిమిషాలు), కామెరూన్ విజువల్ వండర్ `అవతార్: ది వే ఆఫ్ వాటర్` (3 గంటల 12 నిమిషాలు) నిలిచాయి. వీటితో పాటు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `ఓపెన్‌హైమర్` కచ్చితంగా 3 గంటల నిడివితో మెప్పించగా, `ది బ్యాట్‌మన్` (2 గంటల 56 నిమిషాలు), `కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్` (3 గంటల 26 నిమిషాలు) వంటి సుదీర్ఘ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి.
మరోవైపు.. హాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయిన పాత క్లాసిక్ చిత్రాల నిడివిని పరిశీలిస్తే.. అవి కూడా సుదీర్ఘ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించినవే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన `గ్లాడియేటర్` (2000) థియేట్రికల్ నిడివి 2 గంటల 35 నిమిషాలు కాగా... దాని ఎక్స్‌టెండెడ్ వర్షన్ 2 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే చారిత్రక కథా నేపథ్యంతో వచ్చిన `ట్రాయ్` (2004) చిత్రం 2 గంటల 43 నిమిషాల థియేట్రికల్ రన్‌టైమ్‌ను (డైరెక్టర్స్ కట్ వర్షన్ 3 గంటల 16 నిమిషాలు) కలిగి ఉంది. అయితే వీటన్నింటికీ భిన్నంగా విజువల్ సంచలనం సృష్టించిన `300` (2006) చిత్రం మాత్రం చాలా తక్కువ నిడివితో.. కేవలం 1 గంట 57 నిమిషాల రన్‌టైమ్‌తోనే ప్రేక్షకులకు పూర్తి స్థాయి పవర్‌ఫుల్ యాక్షన్ ట్రీట్‌ను అందించింది.