కేంద్రం కీలక అనుమతి.. ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్?
మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దశాబ్ధాలుగా ప్రజలకు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ దశాబ్ధాలుగా ప్రజలకు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లు నిరంతరాయంగా పేదలు, అవసరంలో ఉన్నవారి కోసం సేవలందిస్తున్నాయి. దశాబ్ధాలుగా సాగుతున్న ఈ సేవాకార్యక్రమాలలో మెగాభిమానులు అవిరామంగా కృషి చేయడమే గాక, లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ధాతలుగా మారారు. అయితే ఈ సేవలను మరింత విస్త్రత పరచడానికి మెగాస్టార్ చిరంజీవి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. తలసేమియా లాంటి అరుదైన రుగ్మతకు నిరంతరం రక్తం అవసరం. ప్రతిరోజూ రక్తమార్పిడి చేయాల్సిన అరుదైన ప్రమాదకర రుగ్మత ఇది. దీనికోసం చిరంజీవి నిరంతరం తన అభిమానులు, ప్రజలకు రక్తదానం కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇక బ్లడ్ బ్యాంక్ కేంద్రంగా కరోనా క్రైసిస్ సమయంలో నిత్యావసరాలను ప్రజలకు దానమిచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా ఇది కేవలం రక్తదానం, నేత్ర దానం మాత్రమే కాదు, ప్రజలు, నిరుపేదలు కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి నిరూపించారు. కళారంగంలోను కష్టంలో ఉన్నవారికి విరివిగా ఆర్థిక విరాళాలను చిరంజీవి అందించారు. ఇప్పటికీ ఈ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
తాజా సమాచారం మేరకు.. మెగాస్టార్ స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లు కీలకంగా హైదరాబాద్ (తెలంగాణ) నుంచి సేవలు అందిస్తున్నాయి. కానీ మునుముందు ఆంధ్రప్రదేశ్ లోను ఈ తరహా సేవా సంస్థలను ఏర్పాటు చేసేందుకు, స్థానిక ప్రజలకు మరింత దగ్గరగా అందుబాటులో ఉండేందుకు చిరంజీవి బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. `చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్` కోసం ఏపీలో ఒక కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు
ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై:
తాజా సమాచారం మేరకు.. బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ సేవలను మరింత విస్త్రత పరిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్.సి.ఆర్.ఏ) పరిధిలో కేంద్రానికి ఒక దరఖాస్తును పంపారు. దీనికి కేంద్ర హోంశాఖ నుంచి ఆమోదం తెలుపుతూ ట్రస్ట్ కు శుభవార్త అందింది. దీంతో ఇకపై విదేశాల నుంచి చిరంజీవి ట్రస్ట్ కు ఆర్థిక విరాళాలను సేకరించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇకపై విదేశాలలో లక్షలాదిగా ఉన్న మెగాస్టార్ అభిమానులు తమ ఆర్థిక విరాళాల సేవలను మరింత విస్త్రత పరచడానికి, సేవకు సద్వినియోగం చేయడానికి మార్గం సుగమమైంది. విరాళాలు పెరిగితే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలను మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చిరుకు అవకాశం లభిస్తుంది.
FCRA అనుమతులు ట్రస్ట్ కు ఎంత కీలకం? అంటే.. విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందాలంటే ఇది తప్పనిసరి. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌సిఆర్.ఏ చట్టం ప్రకారం.. ట్రస్టులు తప్పనిసరిగా ఇందులో నమోదై ఉంటేనే విదేశాల నుంచి నిధులను స్వేచ్ఛగా పొందగలవు. ఇటీవల ఎఫ్‌సిఆర్ఏ నిబంధనలలో సవరణల నేపథ్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా కేంద్ర అనుమతుల సంప్రదించింది. రక్తదానం, నేత్రదానంలో దశాబ్ధాల చరిత్ర ఉన్న ట్రస్ట్ గనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి ఆమోద ముద్ర వేసారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ అనుమతి ట్రస్ట్‌కు మరింత జవాబుదారీతనాన్ని, అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుతుంది. ట్రస్ట్ సేవలు మరింత విస్తృతపరచడానికి మార్గం సుగమం చేస్తుంది.
సేవలలో నంబర్ -1
సేవలలో ఇప్పటికే నంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ట్రస్ట్ ఇకపై ప్రజల్లోకి మరింత విస్త్రతంగా సేవలను విస్తరించడానికి అవకాశం కలగనుంది. విదేశాల నుంచి ధాతలు ఇకపై స్వేచ్ఛగా తమ విరాళాలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు అందించవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సేవాకార్యక్రమాలు చేసినా ఒక సెక్షన్ మీడియా దానిని ప్రచారం చేసేందుకు ఆలోచిస్తుంది. కానీ ఇటీవలి కాలంలో ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని మీడియాలు చిరంజీవి సేవలకు సంబంధించిన కవరేజీని ఇవ్వడం శుభపరిణామం.
అభిమానులు హర్షం:
చిరు ధాతృత్వానికి కేంద్రం నుంచి గుర్తింపు లభించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులంతా `మేము సైతం` అంటూ మరింత ఉధృతంగా సేవాకార్యక్రమాల కోసం ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీలోను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు కావాలని అభిమానుల నుంచి విస్త్రతంగా డిమాండ్లు అందడంతో చిరు ఆ దిశగా ఆలోచిస్తున్నారని టాక్ వినిపించింది. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ లోను ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు చిరంజీవి ప్లాన్ చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది.