హిట్ సెంటిమెంట్ తోనే అలా సీన్లోకి 158!

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `వాల్తేరు వీరయ్య` భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.;

Update: 2026-04-29 05:54 GMT

మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో `మెగా 158` షూటింగ్ విషయంలో ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను నేరుగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో ప్రారంభించిన‌ట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు ప్రారంభ సన్నివేశాలతో మొదలవుతాయి. కానీ బాబీ మాత్రం ఈసారి మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే ఇంటర్వెల్ ఫైట్ లేదా కీలక ఘట్టంతో కెమెరా ముందుకు వెళ్లారు. దీని వెనుక ఓ బలమైన సెంటిమెంట్ ఉందనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `వాల్తేరు వీరయ్య` భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ముందే పూర్తి చేయడం ఆ చిత్ర విజయానికి ఒక సెంటిమెంట్‌గా మారిందని భావిస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే అదే బాటలో పయనిస్తూ మెగా 158 విషయంలో కూడా హై-వోల్టేజ్ ఇంటర్వెల్ బ్యాంక్ తోనే శ్రీకారం చుట్టారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే మెగాస్టార్ కెరీర్‌లో మరో భారీ హిట్ ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోం ది. చిరంజీవి- మోహన్ లాల్ వంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్‌లో అది కూడా ఇంటర్వెల్ వంటి పవర్ ఫుల్ సీక్వెన్స్‌లో కనిపించనుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. అయితే సినిమాలో లాల్ పాత్ర ఎలాంటిది అన్న‌ది క్లారిటీ లేదు. ఇద్ద‌రు ఎదురెదురు త‌ల‌ప‌డ‌తారా? లేక సానుకూల పాత్ర‌లో లాల్ క‌నిపిస్తారా? అన్న‌ది తేలాలి. అలాగే మోహ‌న్ లాల్ బిజీ న‌టుడు. ఆయ‌న డేట్లు దొర‌క‌డం కూడా క‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇచ్చిన డేట్ల ప్ర‌కారం బాబి ఇలా ఇంట‌ర్వెల్ సీన్ తో ప‌ట్టాలెక్కించారు? అన్న‌ది మ‌రో వెర్ష‌న్. కార‌ణాలు ఏవైనా? హిట్ సెంటిమెంట్ ను మాత్రం ఫాలో అవుతున్నారు.

ఈ చిత్రం భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది. చిరంజీవిని ఓ రస్టిక్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నారు. `వాల్తేరు వీరయ్య`లో చిరు వింటేజ్ లుక్ ఎంతటి ప్రభావాన్ని చూపిందో, ఇందులో ఆయన బాడీ లాంగ్వేజ్ అంతకు మించి ఉంటుందని సమాచారం. ప్రారంభంలోనే ఇంతటి భారీ షెడ్యూల్ ప్లాన్ చేయడం తో సినిమా మూడ్ - టెక్నికల్ క్వాలిటీపై స్పష్టత వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.సెంటిమెంట్‌ను నమ్ముకుంటూనే కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా బాబీ మెగా ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో మొదలైన ఈ ప్రయాణం 2027 సంక్రాంతి బరిలో నిలవబోతోంది.

Tags:    

Similar News