స్క్రీన్ ప్లే స్టడీ కోసం చూడాల్సిన గ్రేట్ మూవీ
విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి ఓ సెల్యులాయిడ్ కావ్యంగా ఈ అద్భుత చిత్రాన్ని మలిచారు;
తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నటికీ మరపు రాని క్లాసిక్ చిత్రం- మాయాబజార్. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రమిది. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ఈ చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు. దర్శకుడు కె.వి.రెడ్డి ఓ సెల్యులాయిడ్ కావ్యంగా ఈ అద్భుత చిత్రాన్ని మలిచారు.
ఈ సినిమాకు పింగళి నాగేంద్ర రావు అద్భుతమైన మాటలను అందించారు. ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్ లే ఈ సినిమాను నవరస భరితంగా తెరమీద చూపించారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో ఈ చిత్రాల్లోని పాటలు ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. శ్రీకృష్ణుడు గా ఎన్. టి. రామారావు, ఘటోత్కచుడు గా ఎస్. వి. రంగారావు, శశి రేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వర రావు ఆయా పాత్రలను సజీవంగా ప్రేక్షకుల కళ్ల ముందు నిలబెట్టారు . 27 మార్చి 1957లో తెలుగు రాష్ట్రంలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను కలర్ లో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల కోసం రామారావు బలుసు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతాలు ఆవిష్కరించిన చిత్రమిది. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఆయన అభిమాని దీనిని రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.
నిజానికి మాయాబజార్ చిత్రం చాలా కోణాల్లో ప్రజల మెప్పు పొందింది. వాటిలో ముఖ్యంగా ఎస్వీ రంగారావు ఘటోత్కచుడిగా నటించిన వైనం, మహానటి సావిత్రి అద్భుత అభినయం, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ప్రదర్శన వగైరా ఎంతో ఆకర్షిస్తాయి. ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే, ఛాయాగ్రహణం, పాటలు, సంగీతం ఇలా అన్ని విభాగాల్లో ఎంతో ప్రత్యేకమైనది. ముఖ్యంగా నేటి ఔత్సాహిక ఫిలింమేకర్స్ మాయాబజార్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ ని స్టడీ చేస్తే అది వారికి చాలా సహకరిస్తుంది. ప్రఖ్యాత పూణే ఫిలింఇనిస్టిట్యూట్ విద్యార్థుల కోసం మేటి క్లాసిక్ `మాయాబజార్` స్క్రీన్ ప్లే పై ప్రత్యేకంగా విశ్లేషిస్తారు.