దీనికి కదా సీక్వెల్ రావాలి
తెలుగులో హారర్ సినిమా వస్తోందంటే దెయ్యం ఎంత భయపెడుతుందో అనే ఆసక్తి ఉంటుంది. కానీ సినిమా చూశాక భయపడటం కంటే నిరాశపడుతున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలుగులో హారర్ సినిమా వస్తోందంటే దెయ్యం ఎంత భయపెడుతుందో అనే ఆసక్తి ఉంటుంది. కానీ సినిమా చూశాక భయపడటం కంటే నిరాశపడుతున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా విడుదలైన '418'కు కూడా మిక్స్డ్ టాక్ ఎదురైంది. దీంతో సోషల్ మీడియాలో కొందరు మళ్లీ 'మసూద'ను గుర్తుచేసుకుంటున్నారు. అసలు పెద్దగా హడావుడి లేకుండా వచ్చి ప్రేక్షకులను భయపెట్టిన ఆ సినిమాకు ఇప్పటివరకు సీక్వెల్ ఎందుకు రాలేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
2022లో వచ్చిన 'మసూద'కు పెద్ద స్టార్ కాస్ట్ లేదు. భారీ ప్రమోషన్లు కూడా చేయలేదు. సంగీత, తిరువీర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమా మౌత్ టాక్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దెయ్యాన్ని చూపించకముందే ప్రేక్షకుల్లో భయం మొదలయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా ఏదో ప్రమాదం జరగబోతోందనే ఫీలింగ్ ఇచ్చాయి.
'మసూద'లో మరో ప్లస్ కథ నడిచే విధానం. తన కూతురిని కాపాడుకోవడానికి తల్లి పడే తపన, అసలే భయస్తుడైన గోపీ ఆ కుటుంబానికి అండగా నిలబడటం సినిమాకు మంచి ఎమోషనల్ బలం ఇచ్చాయి. దెయ్యం వెనకున్న గతాన్ని కూడా మెల్లగా బయటపెట్టారు. పైగా రాత్రిపూట సన్నివేశాలు, సౌండ్ డిజైన్, ప్రశాంత్ ఆర్ విహారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మంచి హారర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి.
ఇక '418' విషయానికి వస్తే మెడికల్ కాలేజీ హాస్టల్లో పదిహేనేళ్లుగా మూసి ఉన్న గది అనే పాయింట్ బాగానే ఉంది. ప్రశాంత్ నీల్ సమర్పణలో రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. కొన్ని హారర్ సీన్లు, సౌండ్ డిజైన్, చైత్ర ఆచార్ నటనకు మంచి స్పందన వచ్చింది. కానీ కథ ముందుకు వెళ్లేకొద్దీ అదే స్థాయిలో భయపెట్టలేకపోయిందని, స్క్రీన్‌ప్లేలో పట్టు తగ్గిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడల్లా 'మసూద' పేరు మళ్లీ వినిపించడానికి మరో కారణం ఉంది. ఆ సినిమాలో దెయ్యం కథను పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా దాని నేపథ్యంపై ఆసక్తి మిగిలింది. దర్శకుడు సాయి కిరణ్ అదే ప్రపంచంలో మరో కథను చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం హారర్ అభిమానుల్లో ఉంది. కొత్త పాత్రలు, మరో ప్రాంతం తీసుకున్నా మసూద నేపథ్యంతో భయపెట్టడానికి కావాల్సిన స్కోప్ కనిపిస్తోంది.
అయితే 'మసూద 2' గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్క కూడా సీక్వెల్‌కు సంబంధించి కొత్త అప్డేట్ ఇవ్వలేదు. మరోవైపు సాయి కిరణ్ ఇటీవల నాగచైతన్యకు హారర్ థ్రిల్లర్ కథ వినిపించినట్లు వార్తలొచ్చాయి. చైతన్య నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తే 'మసూద' తర్వాత సాయి కిరణ్ నుంచి మరో హారర్ సినిమా వచ్చే అవకాశముంది.