అప్పుడు మా నాన్న బండి.. ఇప్పుడు నా కటౌట్.. మారుతి ఎమోషనల్
పలు థియేటర్స్ లో టీజర్ స్క్రీనింగ్ కూడా చేయనుండగా.. అక్కడ ప్రభాస్ భారీ కటౌట్లు పెట్టారు. మచిలీపట్నంలో సిరి కాంప్లెక్స్ థియేటర్ వద్ద మారుతి కటౌట్ కూడా పెట్టడం గమనార్హం.;
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ అభిమాని అయిన ఆయన.. చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రోజుల్లో మూవీతో డైరెక్టర్ గా మారారు. అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత మెల్లగా మిడ్ రేంజ్ హీరోలతో సక్సెస్ కొట్టారు.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిస్తున్న సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. అయితే సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్ గా మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం టీజర్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అంతా వెయిట్ చేస్తుండగా.. ఆదివారం ప్రీ టీజర్ రిలీజ్ చేసి భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఎందుకంటే.. ప్రీ టీజర్ తో మూవీ లవర్స్ తోపాటు డార్లింగ్ ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పించారు.
దీంతో టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. పలు థియేటర్స్ లో టీజర్ స్క్రీనింగ్ కూడా చేయనుండగా.. అక్కడ ప్రభాస్ భారీ కటౌట్లు పెట్టారు. మచిలీపట్నంలో సిరి కాంప్లెక్స్ థియేటర్ వద్ద మారుతి కటౌట్ కూడా పెట్టడం గమనార్హం. అయితే మారుతిది మచిలీపట్నం అని తెలిసిందే. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఎమోషనలయ్యారు.
తన కటౌట్ పిక్ ను షేర్ చేసిన మారుతి.. అదే ప్లేస్ లో తన నాన్న ఒక చిన్న స్టాల్ లో అరటి పండ్లు అమ్మేవారని తెలిపారు. "నేను ఇక్కడ కట్టే బ్యానర్స్ రాసేవాడిని. ఆ బ్యానర్స్ పై ఒక్కసారైనా నా పేరు చూడాలని ఎప్పుడూ కలలు కనేవాడిని. ఇప్పుడు ఇంతటి స్థాయికి వచ్చాను" అంటూ పాత రోజులు గుర్తు చేసుకున్నారు మారుతి.
"ఇప్పుడు నిలబడి ఇదంతా ఎక్కడ ప్రారంభమైందో తిరిగి చూస్తున్నా. పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ ఉంది. ఇది చాలదా నాకు. మా నాన్న ఇది చూసి ఉంటే గర్వంగా పడేవారు. మిస్ యు నాన్న. నేను ఇప్పుడు మోస్తున్న కృతజ్ఞతకు ధన్యవాదాలు అనేది చాలా చిన్నది అనిపిస్తుంది. టీజర్ చెప్పిన టైమ్ కి వస్తుంది" అంటూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. ఇది కదా అసలైన సక్సెస్ అంటే అని కామెంట్లు పెడుతున్నారు. జీవితంలో అనుకున్నది సాధించారని అంటున్నారు. ఇప్పుడు రాజా సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.