సినిమా బడ్జెట్ హల్చల్ పిఆర్ వ్యూహమేనా?
ప్రస్తుతం పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌లతో ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కుతున్నాయి.
ప్రస్తుతం పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్ల భారీ బడ్జెట్‌లతో ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అయితే సినిమా విడుదల కాకముందే దాని నిర్మాణ వ్యయం గురించి మీడియాలో వచ్చే వార్తలు, హంగామా వెనుక అసలు నిజమెంత అనే చర్చ మొదలైంది. తాజాగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఈ బడ్జెట్ హేమాహేమీలపై - ప్రచార శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న `రామాయణ` లేదా ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` వంటి మైలురాయి ప్రాజెక్టుల బడ్జెట్ల గురించి పరిశ్రమలో నిరంతరం లీకులు, చర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మనోజ్ బాజ్‌పాయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి . సినిమాల బడ్జెట్ల 500 కోట్లు, 1000 కోట్లుగా చూపించడం అనేది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి .. మార్కెట్‌లో క్రేజ్ సృష్టించడానికి ఉపయోగించే ఒక పబ్లిక్ రిలేషన్స్ వ్యూహం మాత్రమేనని కొట్టి పారేశారు. ఒక సినిమా విజయాన్ని లేదా దాని నాణ్యతను ఆ చిత్రానికి పెట్టిన ఖర్చు నిర్ధారించలేదని మనోజ్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక హంగులు, విజువల్ ఎఫెక్ట్స్ , భారీ తారాగణం చిత్రానికి అదనపు ఆకర్షణలు మాత్రమే. కానీ కథలో బలం లేకపోతే ఎంత పెద్ద బడ్జెట్ అయినా ? వృధా అవుతుందని ఆయన నమ్ముతానన్నారు.
సినిమా విజయవంతం కావడానికి బలమైన రచన, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ,నటీనటుల సహజ సిద్ధమైన ప్రదర్శన అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఏమిటంటే? ప్రకటించిన భారీ బడ్జెట్లలో చాలా భాగం అగ్ర తారల పారితోషికాలకే సరిపోతోందన్నారు. దీంతో అసలు కథపై, మేకింగ్ నాణ్యతపై పెట్టే ఖర్చు తగ్గుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. బడ్జెట్ అంకెలను పెద్దవిగా చూపించి బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ సాధించాలనే తాపత్రయం కంటే? ఆ నిధులను కథన నైపుణ్యాలను పెంపొందించడానికి .. సాంకేతిక అభివృద్ధికి సమర్థవంతంగా ఉపయోగించాలని భావిస్తున్నారు.
స్టార్ పవర్ లేదా బడ్జెట్ హంగులను చూసి మోసపోవడం లేదు. గత కొంత కాలంగా ఓపెనింగ్స్ భారీగా వచ్చినా? కంటెంట్ లేని చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేని చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా బలమైన కథాంశంతో ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఇండస్ట్రీ కేవలం అంకెల మాయాజాలం నుండి బయటపడి సినిమా అసలు ఆత్మ అయిన కథా విలువలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏదేమైనా సినిమా మార్కెటింగ్‌లో బడ్జెట్ అనేది బలమైన ఆయుధంగా మారిన మాట వాస్తవం. సినిమా అనేది వ్యాపారమే అయినా? అది ఒక అద్భుతమైన కళ అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనోజ్ బాజ్‌పాయ్ లాంటి సీనియర్ నటులు చేసిన ఈ హెచ్చరికలు, పరిశ్రమలో బడ్జెట్ అంకెల ప్రచార ఆర్భాటాలకు చెక్ పెట్టి సృజనాత్మకతకు -నిజాయితీ గల చలనచిత్ర నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చేలా పునరాలోచనలో పడేస్తాయని ఆశిద్దాం.